వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో విజయం దక్కించుకుని ఏపీలో అధికారం చేపడతామని పదే పదే చెబుతున్న పవన్ కళ్యాణ్.. ఇటీవల ఒక సంచలన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఉద్యోగులు ఎన్నోఏళ్లు గా ఎదురు చూస్తున్న సీపీఎస్ (కంట్రిబ్యూటరి పింఛన్ పథకం)ను రద్దు చేస్తామని, తాము అధికారంలోకి రాగానే రెండో సంతకం ఈ ఫైలుపైనే పెడతామని ఆయన చెప్పారు. వాస్తవానికి ఇది పెద్ద హామీ అనే చెప్పుకోవాలి. పైగా.. ఇప్పటి వరకు అటు చంద్రబాబు కానీ, ఇటు జగన్ కానీ నెరవేర్చని హామీ కూడా.
పైగా.. నాలుగున్నర లక్షల మంది ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన డిమాండ్ కూడా. వారు అనేక ఉద్యమాలు కూడా చేశారు ..చేస్తున్నారు. ఇప్పటికీ.. జగన్‌ను డిమాండ్ చేస్తున్నారు. గత ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కూడా వారు కోరుతున్నారు. కానీ, వైసీపీ అధినేత, సీఎం జగన్ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీయే అయినా.. దీనివెనుక ఆర్థికంగా కష్ట నష్టాలు ఉన్నాయని భావిస్తూ.. ఈ నిర్ణయం తీసుకునేందుకు వెనుకాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది.
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిలో అంటే.. గతంలో చంద్రబాబు కూడా ఈ హామీని నెరవేర్చలేక పోయారు. అప్పట్లో టక్కర్ కమిటీని వేసి.. ఆయన తప్పుకొన్నారు. ఈ నేపథ్యంలో తాజాగా ఉద్యోగుల డిమాండ్‌ను తాను నెరవేస్తానని పవన్ చెప్పుకొచ్చారు. ఉద్యోగులకు ఉపశమనం కలిగించేందుకు తాను ముందుకు వస్తానని అన్నారు. అయితే.. దీనిపై ఆశించిన మైలేజీ జనసేనకు వచ్చిందా? అంటే లేదనే చెప్పాలి. ఎందుకంటే.. పవన్ చేసిన ప్రకటనకు ఉద్యోగులు ఒక్కరంటే ఒక్కరు కూడా దీనిపై స్పందించలేదు.
పవన్‌కు అభినందనలు తెలపడం కానీ, ఆయన పార్టీకి తాము అండగా ఉంటామని కానీ.. ఉద్యోగులు ప్రకటించలేదు. పైగా.. జనసేన నాయకులు కూడా అసలు ఈ హామీని పవన్ ప్రకటించిన విషయాన్ని సైతం మరిచిపోయినట్టుగా వ్యవహరిస్తున్నారు. నిజానికి పవన్ చేసిన ప్రకటనను ప్రజల్లోకి తీసుకువెళ్తే.. సుమారు.. 20 లక్షల ఓట్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న 4 లక్షల మంది ఉద్యోగులు రిటైరైన 3 లక్షల మంది ఉద్యోగుల కుటుంబాల ఓట్లు ఈ పార్టీకే దక్కుతాయి. కానీ, జనసేన నేతలు మాత్రం ఈ విషయాన్ని పట్టనట్టే వ్యవహరిస్తుండగా.. మరోవైపు ఉద్యోగులు సైతం.. దీనిపై రియాక్ట్ కాకపోవడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates