ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. రాజధాని అమరావతిలోని ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ కేసులో మాజీ మంత్రి నారాయణ ముందస్తు బెయిల్ రద్దుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. విచారణకు సహకరించకపోతే దర్యాప్తు సంస్థలు న్యాయ స్థానాలను ఆశ్రయించాలని సూచించింది. ప్రతి చిన్న దానికి సుప్రీంకోర్టుకు రావడం ఏపీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని న్యాయమూర్తులు జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం చురకలంటించింది.
అమరావతి మాస్టర్ ప్లాన్, ఇన్నర్ రింగ్‌రోడ్డు అలైన్‌మెంట్ మార్పు కేసులో నారాయణ ఉద్దేశ పూర్వకంగా తప్పులు చేశారని, కొందరు టీడీపీ నేతలకు.. తనకు కూడా లబ్ధి చేకూర్చుకునేలా ఆయన వ్యవహరించారంటూ ఏపీ ప్రభుత్వం ఆయనపై కేసులు నమోదు చేసింది. ఈ క్రమంలో తనను అరెస్టు చేయకుండా చూడాలని.. ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని ఆయన హైకోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
దీంతో హైకోర్టు తీర్పును ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఆర్థిక నేరాలతో కూడిన కేసు అని, నిందితులు సీఐడీ విచారణకు సహకరించడం లేదని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఈ విషయం హైకోర్టు దృష్టికి తెచ్చినా ముందస్తు బెయిల్ ఇచ్చిందని అన్నారు. అయితే ‘‘మీ రాజకీయ ప్రతీకారంలో తమను భాగస్వాములు చేయొద్దు’’ అని ధర్మాసనం పేర్కొంది. నిందితులు విచారణకు సహకరించకపోతే సీఐడీ బెయిల్ రద్దు పిటిషన్ ను హైకోర్టులోనే వేసుకోవాలని సుప్రీం కోర్టు సూచిస్తూ… ఏపీ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. నిందితులు దర్యాప్తునకు సహకరించకపోతే హైకోర్టునే ఆశ్రయించవచ్చని పేర్కొంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates