గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలోని తాడేపల్లి మండలం ఇప్పటం గ్రామంలో రహదారి విస్తరణ పేరుతో తొలగించిన ఇళ్ల వ్యవహారం ఇప్పుడు వైసీపీ నాయకుడు, ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్నారెడ్డి మెడకు చుట్టుకుంటోంది. ఇక్కడి ప్రజలు ఆయనవైపే వేలెత్తి చూపిస్తున్నారు. ఆళ్ల వర్గానికి చెందిన నేతలు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన ఆవిర్భావ సభ మార్చి 14న జరిగిందని.. ఏప్రిల్ 22న ఇళ్లు తొలగిస్తామని నోటీసులు ఇచ్చారని గ్రామస్తులు చెబుతున్నారు.
ఇళ్ల కూల్చివేతపై ఆళ్ల వర్గం చేస్తున్న అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మకూడదని వారు చెబుతున్నారు. తమ గ్రామంలో ఎవరిపైనా దాడులు జరిగితే.. దానికి కారణం ఆళ్ల రామకృష్ణారెడ్డిదే పూర్తి బాధ్యత అని చెప్పారు. ఇప్పటంలో రహదారి విస్తరణ పేరుతో తొలగించిన ఇళ్ల వ్యవహారంలో రాజకీయం ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే ఇళ్ల కూల్చివేతలో వైసీపీ ఉద్దేశ పూర్వకంగానే దూకుడు ప్రదర్శించిందని.. కేవలం జనసేనకు ఇక్కడి రైతులు భూములు ఇచ్చారనే ఉద్దేశంతోనే వారి ఇళ్లను కూల్చేసిందని ఆయన ఆరోపించారు.
ఈ క్రమంలోనే ఇప్పటం వచ్చి ఇక్కడి బాధిత ప్రజలను ఓదార్చారు. వారికి తాను అండగా ఉంటానని, కూల్చి వేతల ప్రభుత్వం కూలిపోవాలని పిలుపునిచ్చారు. జనసేన నాయకులు, కార్యకర్తలు ఇక్కడి ప్రజలకు అండగా ఉండాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో పవన్ అటు హైదరాబాద్ వెళ్లిపోగానే ఆళ్ల వర్గంగా చెబుతున్న కొందరు రంగంలోకి దిగి.. అనుకూల మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో జనసేన సహా ప్రతిపక్ష టీడీపీ పైనా విమర్శలు గుప్పించారు. ఇక్కడ ఎప్పుడో మార్కింగు వేశారని, వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుంటే జనసేన, టీడీపీలు అడ్డుపడుతున్నాయని.. ఈ కూల్చివేతల్లో ప్రభుత్వ తప్పులేదని వారు వాదించారు.
ఈ పరిణామాలపై తాజాగా ఇప్పటం గ్రామస్తులు స్పందించారు. ఆళ్ల వర్గం చేస్తున్న అసత్య ప్రచారాన్ని గ్రామస్థులు తిప్పికొట్టారు. కేవలం జనసేన సభకు స్థలమిచ్చామని అక్కసుతోనే వైసీపీ ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని గ్రామస్థులు వాపోయారు. గ్రామంలో ప్రస్తుతం ఉన్న రహదారి 60 అడుగులు ఉందని.. దీనిని నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. రహదారి విస్తరణ అయితే.. వైఎస్ విగ్రహం మాత్రం అధికారులకు కనిపించలేదా అని ప్రశ్నించారు. కేవలం జనసేన సభకు స్థలమిచ్చామని అక్కసుతోనే ప్రభుత్వం ఈ దారుణానికి పాల్పడిందని గ్రామస్థులు వాపోయారు. మొత్తం 31 మంది గ్రామస్థులు తమ భూములను సభ నిర్వహించుకునేందుకు అనుమతి ఇవ్వగా.. వారిలో పది మంది ఇళ్లను కూలగొట్టారని చెప్పారు. తమకు ఏదైనా జరిగితే ఎమ్మెల్యే ఆళ్లదే బాధ్యతని వారు తేల్చి చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates