మునుగోడు ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. కానీ, తెలంగాణ సీఎం కేసీఆర్.. గడప దాటి రాలేదు. పైగా ఢిల్లీ వెళ్లారు. బీఆర్ఎస్ పనుల్లో బిజీబిజీగా గడిపారు. అంతేకాదు.. ఢిల్లీలో నిర్మిస్తున్న భవనం పనులను ఆయన ప్రత్యక్షంగా పర్యవేక్షించారు. ఈ కీలక సమయంలో ఈయన ఇలా చేస్తున్నాడేంటని.. పార్టీ నేతలు సహా మీడియా తలపట్టుకుంది. కానీ, కేసీఆర్ గడప దాటకుండానే తన వ్యూహాలను మునుగోడులో దించేశారు. దీంతో అనూహ్యమైన విజయాన్ని కారెక్కించుకుని వెళ్లిపోయారు.
కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారని, ఉప ఎన్నికలు వస్తాయన్న అంచనాలతో కొన్ని నెలల ముందు నుంచే టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా మునుగోడుపై దృష్టి కేంద్రీకరించారు. 2018 ఎన్నికల్లో కోల్పోయిన ఈ స్థానాన్ని తిరిగి సొంతం చేసుకోవాలన్న కసితో బరిలో దిగారు. గతంలో దుబ్బాక, హుజూరాబాద్‌లో ఎదురైన అనుభవాలను గుణపాఠంగా తీసుకొని పక్కా వ్యూహంతో అడుగులు వేశారు.
ఈ సీటును అనేకమంది నేతలు ఆశించినప్పటికీ వాళ్లను కాదని 2014లో ఇక్కడ గెలుపొందిన కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డినే అభ్యర్థిగా రంగంలోకి దించారు. మునుగోడులో బీసీ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత బూర నర్సయ్యగౌడ్ లాంటి నేతలు పార్టీని వీడి బీజేపీలో చేరినా ఏమాత్రం పట్టుసడలకుండా పార్టీ శ్రేణుల్ని భారీగా మోహరించారు. మండలానికో ఇన్‌ఛార్జిని నియమించి బూత్‌స్థాయి నుంచే నేతల్ని, కార్యకర్తల్ని సమన్వయం చేసుకొని విజయం కోసం అహర్నిశలూ శ్రమించారు. అయితే, ఇదంతా నాలుగు గోడల మధ్యనే జరిగిపోయింది.
ఇక, మునుగోడులో విజయం సాధించి రాష్ట్రంలో ప్రత్యామ్నాయ శక్తిగా మారాలన్న బీజేపీ నేతల ఆశలపై కేసీఆర్ వ్యూహాలు నీళ్లు చల్లాయి. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఆగస్టు 20న అక్కడ ఏర్పాటు చేసిన ప్రజాదీవెన సభలో కమ్యూనిస్టులతో పొత్తును ప్రకటించడం ఆ పార్టీ విజయానికి బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. ఎందుకంటే ఒకప్పుడు నల్గొండ జిల్లా కమ్యూనిస్టులకు కంచుకోటలా ఉండేది. ఈ నియోజకవర్గంలో గతంలో వామపక్షాలు ఐదు పర్యాయాలు విజయం సాధించాయి. ప్రస్తుతం వామపక్షాలు బలహీనపడినా ఇక్కడ సీపీఎం, సీపీఐలకు గణనీయమైన ఓట్లు ఉన్నాయి.
దీన్ని ముందే పసిగట్టిన సీఎం కేసీఆర్ వామపక్షాల నేతలతో కలిసి మునుగోడుకు వెళ్లి సభలో పొత్తు అంశాన్ని ప్రకటించడం, ప్రచారంలోనూ వామపక్ష పార్టీల రాష్ట్రస్థాయి ముఖ్య నేతలు చురుగ్గా పాల్గొని బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేయడం వంటి పరిణామాలు టీఆర్ ఎస్ అభ్యర్థి విజయానికి దోహదపడ్డాయి. ఇక, మరోవైపు మునుగోడులో భారీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలను మోహరించి రాష్ట్రంలో తమ ప్రభుత్వం అమలు చేస్తోన్న పథకాలను చూపించి ఓట్లు అడిగారు.
మిషన్ భగీరథ, రైతుబంధు, దళితబంధు, కల్యాణ లక్ష్మీ, రైతుబీమా తదితర పథకాలన్నింటినీ ప్రచారంలో భాగంగా చేసుకోవడంతో పాటు పోలింగ్ దగ్గరపడుతున్న సమయంలో చేపట్టిన పక్కా పోల్ మేనేజ్‌మెంట్ ఆ పార్టీకి బాగా కలిసివచ్చింది. కేసీఆర్ ఉమ్మడి నల్గొండ జిల్లా నేతలతో వరుస సమావేశాలతో పాటు కేటీఆర్ వరుస పర్యటనలు, నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలపై దృష్టి, గట్టుప్పల్‌ను మండలంగా ప్రకటించడం వంటివి అధికార పార్టీ విజయానికి బాగా కలిసి వచ్చాయనే చెప్పాలి.