ప‌వ‌న్‌ను సైతం ప్ర‌శ్నిస్తున్న జ‌నాలు!

ప‌శ్నిస్తానంటూ పార్టీ పెట్టి రాజ‌కీయంగా రెండోసారి(తొలిసారి ప్ర‌జారాజ్యం) అరంగేట్రం చేసిన‌ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. త‌ర‌చుగా ఏపీ స‌ర్కారుపై విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసిందే. కౌలు రైతు స‌మ‌స్య‌ల నుంచి ర‌హ‌దారుల దుస్థితి వ‌ర‌కు ఆయ‌న ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు. వాటిపై ప్ర‌భుత్వాన్ని నిల‌దీశా రు. భ‌విష్య‌త్తులోనూ నిల‌దీస్తాన‌ని ఆయ‌న చెప్ప‌క‌నే చెబుతున్నారు. ఇటీవ‌ల విశాఖ ఘ‌ట‌న విష‌యంలోనూ తీవ్ర‌స్థాయిలో స‌ర్కారుపై నిప్పులు చెరిగారు.

అయితే, ప్ర‌శ్నించేవాడికే ప్ర‌శ్న‌లు అన్న‌ట్టుగా తాజాగా మంగ‌ళ‌గిరి మండ‌లం ఇప్ప‌టం గ్రామానికి సంబం ధించి రైతులు ప‌వ‌న్‌కు కూడా ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఇక్క‌డ ఇప్పుడు తీవ్ర ఉద్రిక్త‌త నెల‌కొంది. జూన్‌లో ఇక్క‌డ నిర్వ‌హించిన జ‌న‌సేన ఆవిర్భావ స‌భ‌కు కొంద‌రు రైతులు భూములు ఇచ్చారు. అయితే, దీనిని మ‌న‌సులో పెట్టుకున్న వైసీపీ ప్ర‌భుత్వం రాజ‌కీయంగా క‌క్ష సాధించే క్ర‌మంలో ఇక్క‌డ ఇళ్ల‌ను కూల గొడుతోంద‌న్న‌ది ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఆరోప‌ణ. ఈ నేప‌థ్యంలోనే ఆయ‌న ఇక్క‌డ ప‌ర్య‌టిస్తున్నారు.

మ‌రోవైపు.. ఈ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చిన ప‌వ‌న్‌ను ఉద్దేశించి ఒక‌రిద్దరు రైతులు ఆస‌క్తికర ప్ర‌శ్న‌లు సంధిస్తున్నా రు. గ‌తంలో స‌భ పెట్టిన‌ప్పుడు.. ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు రూ.50 ల‌క్ష‌లు ఇస్తాన‌ని ప‌వ‌న్ చెప్పార‌ని, దీనికి సంబంధించి ఆయ‌న వాగ్దానం కూడా చేశార‌ని, కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఈ విష‌యంపై స్పందించ‌లేద‌ని.. అంటున్నారు. ప‌వ‌న్ ఇప్ప‌టికైనా 50 ల‌క్ష‌లు ఇవ్వాల‌ని వారు ప్ర‌శ్నిస్తున్నారు. అంతేకాదు, ఇప్పుడు జ‌రుగుతున్న ఇళ్ల తొల‌గింపు ప్ర‌క్రియ‌కు రాజ‌కీయాల‌కు సంబంధం లేద‌ని కూడా అంటున్నారు.

మార్చిలో ఈ ఇళ్ల‌కు సంబంధించిన మ్యాప్‌ను అదికారులు ఇచ్చార‌ని చెబుతున్నారు. రోడ్డు విస్త‌ర‌ణ అనేది ఎప్ప‌టి నుంచో ఉంద‌ని చెబుతున్నారు. ప‌వ‌న్ దీనిని రాజ‌కీయం చేయ‌డం స‌రికాద‌ని అనే రైతులు కూడా తెర‌మీదికి వ‌చ్చారు. అయితే, దీనిపై జ‌న‌సేన నాయ‌కులు ఎలా రియాక్ట్ అవుతారోచూడాలి. మొత్తానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌న్‌ను ప్ర‌జ‌లు ఎవ‌రూ ప్ర‌శ్నించ‌లేదు. కానీ, తాజాగా 50 ల‌క్ష‌ల విష‌యంలో ఆయ‌న కు ప్ర‌శ్న‌లు ఎదురు కావ‌డం గ‌మ‌నార్హం.