ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఆ ఆరుగురు మహిళలు

ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ను ఆయన సొంత అల్లుడు వెన్నుపోటు పొడిచారంటూ జరిగే ప్రచారానికి సంబంధించిన వాదనలు వేర్వేరుగా ఉన్నాయి. అయితే.. ఇది ఏ మాత్రం వెన్నుపోటు కాదు అన్న విషయాన్ని చంద్రబాబుకు సన్నిహితంగా ఉండేవారు.. నాటి రాజకీయ పరిస్థితుల గురించి క్షుణ్ణంగా తెలిసిన వారు చెబుతుంటారు. అయినప్పటికి ఆ వాదనను ఏకీభవించకుండా అది ముమ్మాటికి వెన్నుపోటే అని తేల్చేసే వారు కనిపిస్తారు. అయితే.. చంద్రబాబు తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో వెన్నుపోటు మచ్చను తుడిపేసుకునే విషయంలో ఫెయిల్ అయ్యారనే మాట వినిపిస్తూ ఉంటుంది.

ఇక.. విషయంలోకి వస్తే.. ఇప్పుడు ఆ ఎపిసోడ్ గురించిన చర్చ వచ్చిందంటే.. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు వెన్నుపోటు ఎపిసోడ్ ను ఎందుకు ప్రస్తావించారంటే.. తాజాగా ఆయన క్రిష్ణా జిల్లా పెనుమలూరు నియోజకవర్గంలో నిర్వహించిన ఒక కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా కొందరు మహిళలు ఆయన కాళ్లకు నమస్కరించారు. ఈ సందర్భంగా పాత గురుతుల్ని గుర్తు చేసుకున్నారు.

అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఎన్టీఆర్ ఇంటికి తాను వెళ్లానని.. అప్పట్లో ఆయన ఇంట్లో కూర్చొని ఉంటే.. కొందరు మహిళా నేతలు ఆయన కాళ్లకు నమస్కారం చేస్తున్నారన్నారు. ఆ తర్వాత వాళ్లు వెళ్లిన తర్వాత.. అలా కాళ్లకు ఎందుకు నమస్కారం చేస్తున్నారని తాను అడిగానని.. తనపై వారికి ఉన్న అభిమానానికి నిదర్శనమని అప్పట్లో ఎన్టీఆర్ చెప్పారన్నారు. అయితే.. అదేమీ నిజం కాదని తానుచెప్పినా.. ఎన్టీఆర్ ఒప్పుకోలేదన్నారు.

ఇది జరిగిన ఆరు నెలల తర్వాత ఆగస్టు సంక్షోభం చోటు చేసుకోవటం.. ఎన్టీఆర్ కు వెన్నుపోటు పొడిచిన ఎపిసోడ్ లో అప్పట్లో ఎన్టీఆర్ కాళ్లకు నమస్కారం చేసిన ఆరుగురు మహిళా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారంటూ వెంకయ్య చెప్పిన మాట.. ఇప్పుడు చర్చగా మారింది. చంద్రబాబుకు సన్నిహితుడిగా చెప్పే వెంకయ్య నోటి నుంచి కూడా వెన్నుపోటు కథ రావటం బాబుకు కాస్త ఇబ్బంది కలిగించే విషయంగా చెప్పక తప్పదు.