రాహుల్ గాంధీకి కేజీఎఫ్ ఎలివేష‌న్ వాడార‌ని..

సినిమాల్లో హీరో ఎలివేష‌న్ అనే మాట ఎత్తితే కొన్నేళ్ల నుంచి అంద‌రికీ కేజీఎఫ్ సినిమానే గుర్తుకొస్తోంది. మాస్ ఎలివేష‌న్ల‌కు కొత్త అర్థం చెబుతూ య‌శ్ పోషించిన‌ రాకీ క్యారెక్ట‌ర్‌ను శిఖ‌ర స్థాయిలో నిల‌బెట్టాడు ద‌ర్శ‌కుడు ప్ర‌శాంత్ నీల్. మ‌న‌కు అస‌లు ప‌రిచ‌యం హీరోను పెద్ద మాస్ హీరోగా ఫీల‌య్యేలా చేసిన ఘ‌న‌త ప్ర‌శాంత్‌కే ద‌క్కుతుంది. ఆ సినిమా రిలీజైన ద‌గ్గ‌ర్నుంచి బ‌య‌ట ఎవ‌రికి ఏ ఎలివేష‌న్ ఇవ్వాల‌న్నా కేజీఎఫ్ బ్యాగ్రౌండ్ స్కోర్, అందులోని పాట‌లే వాడుతున్నారు.

కేజీఎఫ్‌-2 ఇంకా పెద్ద హిట్ట‌వ‌డంతో ఇందులోని పాట‌లు, బ్యాగ్రౌండ్ స్కోర్‌ను కూడా అంద‌రూ తెగ వాడేసుకుంటున్నారు. ఇందుకు పొలిటిక‌ల్ లీడ‌ర్స్ కూడా మిన‌హాయింపు కాదు. ప్ర‌స్తుతం భార‌త్ జోడో యాత్ర‌తో దేశ‌వ్యాప్తంగా తెగ తిరిగేస్తూ జ‌నాల నోళ్ల‌లో నానుతున్న కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత రాహుల్ గాంధీ కోసం ఆ పార్టీ ట్విట్ట‌ర్ విభాగం వాళ్లు కూడా ఇలాగే కేజీఎఫ్ ఎలివేష‌న్‌ను వాడుకున్నారు.

అదే ఇప్పుడు వారికి ఇబ్బందులు తెచ్చిపెడుతోంది. అనుమ‌తి లేకుండా కేజీఎఫ్-2 మ్యూజిక్‌ను వాడుకున్నారంటూ ఆ సినిమా మ్యూజిక్ రైట్స్‌ను కొన్న ఎంఆర్‌టీ మ్యూజిక్ సంస్థ కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇవ్వ‌డం చ‌ర్చ‌నీయాంశం అవుతోంది. ఆ మాట‌కొస్తే కాంగ్రెస్ ట్విట్ట‌ర్ అకౌంట్లో రాహుల్ యాత్ర‌కు ఎలివేష‌న్ ఇస్తూ చాలా పాట‌ల‌నే వాడుకున్నారు. ఇండియాలో ఇలాంటివి స‌ర్వ సాధార‌ణం.

విదేశాల్లో మాదిరిక కాపీ రైట్ చ‌ట్టాల‌ను ఇక్క‌డ ఫాలో అయ్యేవాళ్లు చాలా త‌క్కువ‌మంది. అలాంటి ఒక చ‌ట్టం ఉంద‌ని తెలియ‌క, తెలిసినా ప‌ట్టించుకోకుండా సినిమా పాట‌లు, వీడియోల‌ను త‌మ‌కు ఇష్టం వ‌చ్చిన‌ట్లు వాడేసుకుంటూ ఉంటారు. అన్నింటికీ కేసులంటూ వెళ్తే వీటి కోస‌మే వేరే కోర్టుల‌ను న‌డ‌పాల్సి ఉంటుంది. ఐతే రూల్ ప్ర‌కారం కాంగ్రెస్ పార్టీ చేసిందైతే త‌ప్పు. మ‌రి కాంగ్రెస్ పార్టీ ట్విట్ట‌ర్ విభాగం వాళ్లుఈ నోటీసుల‌కు ఎలా స్పందిస్తారో చూడాలి.