షర్మిళపై జగన్ చిందులు?

వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి.. ఆయన సోదరి షర్మిళకు తీవ్ర విభేదాలు నెలకొన్నాయని, ఆయన్నుంచి ఆమె వేరు పడుతున్నారని.. తెలంగాణలో కొత్తగా పార్టీ పెడుతన్నారని కొన్నేళ్ల కిందట ఆంధ్రజ్యోతిలో ఒక భారీ కథనం వస్తే చాలామందికి అది సిల్లీ విషయంలా అనిపించింది.

జగన్ జైల్లో ఉన్నపుడు పార్టీని నిలబెట్టడానికి 2 వేల కిలోమీటర్ల పాదయాత్ర చేసిన షర్మిళతో ఆయనకు ఎందుకు విభేదాలు వస్తాయని ఆశ్చర్యపోయారు. కానీ చివరికి ఆంధ్రజ్యోతి అంచనానే నిజమైంది, షర్మిళ తెలంగాణలో పార్టీ పెట్టింది. ఐతే ఇదంతా ఒక పెద్ద డ్రామా అని, అన్నా చెల్లెళ్ల మధ్య గొడవేమీ లేదని.. ఇదంతా పొలిటికల్ గేమ్‌లో భాగమని కొందరన్నారు. కానీ గత కొంత కాలంగా షర్మిళ స్టేట్మెంట్లు, చర్యలు చూస్తుంటే మాత్రం అన్నతో ఆమెకు తీవ్ర విభేదాలే ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది.

ఎన్టీఆర్ యూనివర్శిటీ పేరు మార్పును నిర్ద్వంద్వంగా వ్యతిరేకించడమే కాదు.. కడప ఎంపీ టికెట్ విషయంలో తలెత్తిన గొవవతోనే తమ బాబాయి వివేకానందరెడ్డిని చంపినట్లుగా ఆమె ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వడం.. జగన్‌కు అత్యంత సన్నిహితుడైన అవినాష్ రెడ్డి మీద ఆరోపణలు చేయడం చూస్తే జగన్‌ మీద ఆమె యుద్ధానికి సిద్ధమైనట్లే కనిపించింది. కాగా మీడియా ముందు స్టేట్మెంట్లు ఇవ్వడం వేరు. కానీ ఇప్పుడు షర్మిళ ఏకంగా ఢిల్లీకి వెళ్లి సీబీఐ అధికారుల ముందు ఇదే స్టేట్మెంట్ రికార్డు చేసి రావడం సంచలనం రేపుతోంది.

ఈ విషయం తెలిసి జగన్ తీవ్ర ఆగ్రహానికి గురైనట్లుగా తెలుస్తోంది. కొంత కాలంగా షర్మిళతో జగన్‌కు అసలు మాటలే లేవని.. ఈ నేపథ్యంలో తన తల్లి విజయలక్ష్మికి ఫోన్ చేసి తాజా పరిణామాలపై జగన్ చిందులు తొక్కినట్లు సమాచారం. వివేకా హత్య కేసు విషయాన్ని ఇంతటితో వదిలేయాలని.. దీన్ని తెగే దాకా లాగొద్దని.. ఈ కేసు బిగుసుకుంటే పోయేది తమ కుటుంబ పరువే అని జగన్ హెచ్చరించినట్లు తెలుస్తోంది.