ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడైనా రావొచ్చని.. వచ్చే ఏడాది మే లేదా డిసెంబర్లో వచ్చే అవకాశం ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన ప్రకటన చేశారు. ఈ విషయాన్ని ఆయన తన పార్టీ నేతలకు చెప్పారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలని ఎన్టీఆర్ జిల్లా నేతలకు దిశానిర్దేశం చేసారు. ఈ నెల 4న తేదీన ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, నందిగామలో నిర్వహించ తలపెట్టిన “బాదుడే బాదుడు కార్యక్రమ” నిర్వహణపై జిల్లా నేతలతో సమీక్షించారు. నేతలు అంతా ప్రజల్లోనే ఉండాలన్న చంద్రబాబు.. తాను కూడా ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ రూపొందించుకోనున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, నందిగామలో ఈనెల 4వ తేదీన జరిగే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రోడ్ షోను విజయవంతం చేయాలని మాజీ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు పిలుపునిచ్చారు. నందిగామ, చందర్లపాడు మండల పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించిన దేవినేని.. నందిగామ గాంధీ సెంటర్లో చంద్రబాబు బహిరంగ సభ జరగకుండా అధికార పార్టీ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బహిరంగ సభ నిర్వహించి తీరుతామని చెప్పారు. ఈ విషయాన్ని పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లి పోలీసు ఉన్నతాధికారులను కలిసి అనుమతులు తీసుకుంటామని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో 42 నెలలుగా అధికార వైసీపీ.. అధికార దుర్వినియోగం చేస్తూ భారీగా దోపిడీకి పాల్పడుతుందని ఆరోపించారు. నందిగామలో ఒక్కసారి వైసీపీకి అవకాశం ఇచ్చినందుకు అన్ని వ్యవస్థలను నాశనం చేస్తున్నారని,.. ఎమ్మెల్యే సోదరులు భారీగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. నిత్యావసర వస్తువుల ధరలు భారీగా పెరిగిపోయాయన్నారు. రైతులు జేబులో ఖాళీ చేయడానికే వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు మీటర్లు అని ఆరోపించారు. చంద్రబాబు సభను విజయవంతం చేసేందుకు అన్ని గ్రామాల నుంచి కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates