అవును.. ఇప్పుడు మూడు ప్రధాన పార్టీల్లోనూ మహిళా నాయకులు కావలెను! అనే మాట వినిపిస్తోంది. ముఖ్యంగా ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో మహిళా నాయకుల కొరత వేధిస్తోందని.. ఇటీవల చూచాయగా చంద్రబాబు వ్యాఖ్యానించారు. అంతకాదు..త్వరలోనే మరింత ప్రక్షాళన చేయనున్న నేపథ్యం లో మహిళా నాయకులు అవసరం అవుతారని..వారిని తయారు చేయాలని పార్టీ ఏపీ చీఫ్ అచ్చెన్నాయుడుకు సూచించారు. ప్రస్తుతం ఉన్న వారిని చూస్తే.. వంగలపూడి అనిత, పంచుమర్తి అనురాథ, శ్రీకాకుళం జిల్లాలోని గౌతు శిరీష, అదేవిధంగా ప్రతిభా భారతి కుమార్తె కావలి గ్రీష్మ, వంటి వారు మాత్రమే ఉన్నారు.
వీరు తప్ప.. అని లెక్క వేసుకుంటే.. మాజీ మంత్రులు పీతల సుజాత, పరిటాల సునీత ఉన్నా.. వాయిస్ వినిపించడం లేదు. దీంతో మహిళా నాయకు ల కొరతపై చంద్రబాబు అంచనాలు వేశారు. ప్రస్తుతం వైసీపీని తీసుకుంటే.. ప్రతి జిల్లాలోనూ మహిళానాయకులు ఉన్నారు. మంత్రులు ఉన్నారు. ఒకరిని మించి ఒకరుఫైర్ బ్రాండ్లుగా చక్రం తిప్పుతున్నారు. మరి ఇలాంటి వారితో జోడీగా ఢీ అంటే ఢీ అనేలా చక్రం తిప్పగల నాయకుల కోసం టీడీపీ ఎదురు చూస్తోంది. దీంతో త్వరలోనే జిల్లాల వారీగా సమీక్షలు నిర్వహించి.. ఫైర్ ఉన్న మహిళా నాయకులను తయారు చేయాలని చంద్రబాబు సూచించినట్టు తెలిసింది.
ఇక, మరోవైపు.. జనసేనలోనూ వీర మహిళా విభాగాన్ని బలోపేతం చేయాలని తాజాగా పవన్ నిర్నయించారు. వాస్తవానికి గత ఎన్నికల సమయంలో వీర మహిళా విభాగాన్ని భారీ ఎత్తున నియమించారు. 100 మంది మహిళలతో ఈవిభాగం ఏర్పాటు చేస్తే.. ఇప్పుడు మాత్రం కేవలం 20 మంది మాత్రమే మిగిలారు. దీంతో పవన్ తక్షణమే చర్యలు తీసుకోవాలని.. ప్రతి జిల్లాలోనూ 20 నుంచి 25 మంది వీర మహిళలతో కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ క్రమంలోఇక, జనసేనలోనూ మహిళా నాయకుల నియామకాలు జోరుగా సాగనున్నాయి.
ఇదిలావుంటే, బీజేపీలోనూ మహిళలకు లోటు కనిపిస్తోంది. మహిళా నాయకులు కనిపించడం లేదు. ఒక్క పురందేశ్వరి మినహా.. ఎక్కడా ఏ సభలోనూ మహిళా నాయకులు లేరు. దీంతో ఈ పార్టీలోనూ మహిళా ప్రాతినిధ్యం పెంచాలనే సూచనలు వస్తున్నాయి. అయితే, ఇదేమంత పెద్ద విషయం కాదన్నట్టుగా సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి. తీసుకుంటే కొందరికి అవకాశం ఉంటుంది. ఇక, ఇప్పటికే ఉన్న రత్న ప్రభ వంటి నాయకులు పత్తా లేకుండా పోయారు.