జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు బంపర్ ఆఫర్ ఇచ్చారు మంత్రి బొత్స సత్యనారాయణ. ఇప్పటివరకు తమ మీద జనసేనాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్న దానికి భిన్నంగా ఆయన మాట్లాడుతూ.. పవన్ విషయంపై ఆయన రియాక్ట్ అయిన తీరు ఆసక్తికరంగా మారింది. పవన్ కల్యాణ్ సెలబ్రిటీ కావటం వల్ల.. ఆయన ఎక్కడకు వచ్చినా ఆయన్ను చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున వస్తారని.. ఆయన రాక కారణంగా ఇతురులకు ఇబ్బందులు కలగనివ్వకుండా ఉండేందుకు ఆయన పర్యటన వివరాల్ని తమకు ముందే తెలియజేయాలన్నారు.
తమకు పవన్ టూర్ మీద సమాచారం అందిస్తే.. అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటామని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ నిర్వహించ తలపెట్టిన జనవాణి కార్యక్రమాన్ని ప్రభుత్వం అడ్డుకోవటం లేదన్నారు. కాకుంటే.. ముందస్తు సమాచారం ఇవ్వాలని కోరినట్లుగా వ్యాఖ్యానించారు. పవన్ ఎక్కడికి వస్తారన్న విషయాన్ని ముందుగా తెలియజేస్తే.. తాము అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తామని వ్యాఖ్యానించటం గమనరా్హం.
నోరు తెరిస్తే.. పవన్ పై తీవ్ర స్థాయిలో విరుచకుపడే ఏపీ అధికారపక్షానికి చెందిన కీలక నేత.. పవన్ పాల్గొనే కార్యక్రమాలకు ప్రభుత్వం తరఫు నుంచి పక్కా ఏర్పాట్లు ఉంటాయని చెబుతున్న తీరు చూస్తే.. ఇప్పటికిప్పుడు బొత్స కు ఇలాంటి భావన ఎందుకు కలిగింది? ఇంతకాలం ఎందుకు కలగలేదు? లాంటి ప్రశ్నలు మదిలో మెదిలినా.. వాటిని ప్రశ్నల రూపంలో వ్యక్తం చేయకుండా.. బొత్స వారు చెప్పిన రీతిలో ఫాలో కావాలన్నట్లుగా ఆయన మాటలు ఉన్నాయంటున్నారు. ఈ సందర్భంగా ఆయన పవన్ కు అనుకూలంగా మాట్లాడినట్లే మాట్లాడి.. మరోవైపు టీడీపీ తమ్ముళ్లపై ఆయన చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా మారింది.
తాను బీసీ నాయకుల సమావేశాల్లో పాల్గొంటున్నట్లుగా తెలుగుదేశం నేతలు ప్రశ్నిస్తున్నారని.. తాను కాపు కులంలో పుట్టినా.. ఉత్తరాంధ్రలో తమను బీసీల్లో చేర్చారని సమాధానం ఇచ్చారు. తన మాటతో తనను తాను బీసీల ప్రతినిధిగా చెప్పుకునే ప్రయత్నం చేశారంటున్నారు. ఒకవైపు బీసీగా తనను తాను చెప్పుకుంటూనే.. మరోవైపు కాపు నేతగా ఎస్టాబ్లిష్ కావటమే కాదు.. పవన్ లాంటి అధినేత విషయంలో తానెంత సానుకూలంగా ఉన్నానన్న విషయాన్ని ఓపెన్ గా చెప్పేసే తెలివి చూస్తే.. ఇలాంటివి బొత్సకు మాత్రమే సాధ్యమనిపించక మానదు.