మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం అయిన కుప్పం మీద ఏడాది నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ ప్రత్యేక శ్రద్ధ పెడుతున్న సంగతి తెలిసిందే. చంద్రబాబును ఆయన సొంత నియోజకవర్గంలోనే ఓడించాలని జగన్ చాలా పట్టుదలతో ఉన్న సంగతి తెలిసిందే. 175కి 175 స్థానాల్లో ఎందుకు విజయం సాధ్యం కాదంటూ ఆ మధ్య జగన్ పర్యటన సందర్భంగా గోడల మీద పెయింటింగ్స్ రాయించడం అందరి దృష్టినీ ఆకర్షించింది. కాగా బాబుకు చెక్ పెట్టే ఉద్దేశంతో కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో పట్టుబట్టి వైసీపీని గెలిపించుకున్న సంగతీ తెలిసిందే.
అధికార బలాన్ని ఆ సమయంలో ఎంతగా ఉపయోగించారో అందరూ చూశారు. తమిళనాడు నుంచి జనాన్ని తెప్పించి దొంగ ఓట్లు వేయించిన సంగతి ఆధారాలతో బయటపెట్టారు తెలుగుదేశం మద్దతుదారులు. ఏదైతేనేం.. చివరికి అక్కడ వైసీసీనే గెలిచింది.
కానీ అక్కడ గెలిచిన ఆనందం వైకాపా కౌన్సిలర్లలోనే లేదనడానికి రుజువు తాజాగా బయటికి వచ్చిన ఒక వీడియో. మున్సిపల్ సమావేశం సందర్భంగా ఒక కౌన్సిలర్ భర్త మున్సిపల్ కమిషనర్‌ను బిల్లుల విషయంలో నిలదీశాడు.
ఇంతింత ఖర్చు పెట్టుకుని గెలిస్తే చిన్న చిన్న పనులకు కూడా బిల్లులు చెల్లించడం లేదంటూ అతను ఆవేదన వ్యక్తం చేశాడు ఈ సందర్భంగా ఓటుకు ఐదు వేల రూపాయలు పంచి గెలిచామంటూ అతను నోరు జారాడు. కౌన్సిలర్ భర్త అయిన అతను.. కమిషనర్ ముందు ఇలా మాట్లాడుతూ, నిలదీయడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. కుప్పం మున్సిపాలిటీలో వైసీపీ ఎలా గెలిచిందో చెప్పడానికి రుజువు ఇదని, ఇదీ ఒక గెలుపేనా అంటూ తెలుగుదేశం సోషల్ మీడియాలో ఎదురుదాడి మొదలుపెట్టింది. ఈ గెలుపు విషయంలో ఆ పార్టీ నాయకులకే ఆనందం లేదని, రాష్ట్రమంతటా ఉన్నట్లే ఇక్కడ కూడా బిల్లులు రాక వైకాపా నేతలే ఇబ్బంది పడుతున్నారంటూ టీడీపీ ఎద్దేవా చేస్తోంది.