‘నోటా’ ప్రియులకు పవన్ పంచ్

ఎన్నికల బరిలో ఉన్న ఏ అభ్యర్థికీ ఓటు వేయడం ఇష్టం లేకుంటే ‘నోటా’కు వేసేలా కొన్నేళ్ల కిందట కొత్త అవకాశం కల్పించింది కేంద్ర ఎన్నికల సంఘం. దీని విషయంలో ఎప్పటికప్పుడు భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుత రాజకీయ నేతల పట్ల తమ అసంతృప్తిని తెలియజేయడానికి ఇది సరైన మార్గం అని కొందరంటే.. ‘నోటా’కు వేయడం అంటే విలువైన ఓటు హక్కును వృథా చేసుకోవడమే అని ఇంకొందరంటారు. ఓవరాల్‌గా ‘నోటా’ గురించి తన అభిప్రాయం చెప్పలేదు కానీ.. ఆంధ్రప్రదేశ్‌లో నోటాకు ఓటు వేసిన వారి పట్ల మాత్రం అసహనం వ్యక్తం చేశాడు జనసేనాని పవన్ కళ్యాణ్.

గత పర్యాయం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో 4 శాతం మంది, అంటే దాదాపు పది లక్షల మంది ‘నోటా’కు ఓటు వేయడం ద్వారా పరోక్షంగా క్రిమినల్స్‌కు సహకారం అందించారంటూ పవన్ పంచ్ విసిరాడు. మేధావుల పేరుతో కొందరు ‘నోటా’కు ఓటు వేసి రాష్ట్రానికి నష్టం చేశారన్నట్లు పవన్ మాట్లాడాడు. “కొందరు నోటా అంటారు. మాకు ఈ పార్టీ ఇష్టం లేదండి. ఆ పార్టీ ఇష్టం లేదండి. మేం మేధావులమండి అంటారు. కానీ ఏం సాధించారయ్యా మీరు నోటాకు వేసి? అలాంటపుడు నువ్వు పాస్ పోర్టు కూడా చింపేసుకో. నాకీ దేశం నచ్చలేదని. అన్నీ తీసేసుకుంటావు ప్రయోజనాలు. అది మేధావుల సంకుచిత దృష్టి వాదన. ఉన్నోళ్లలో ఈ వ్యక్తి, ఆ వ్యక్తి, ఇలా పదిమంది ఉన్నారంటే అందులో ఎవరో ఒకరికి ఓటు వెయ్యి.

ఓడిపోయేవాడికి ఓటు వేస్తే ఓటు వేస్టయిపోతుందన్నది వీళ్లు చేసే వాదన. అప్పుడు మాత్రం వచ్చేస్తుంది ఓటు వేస్టయిపోతుందనే మాట. మొన్నటి ఎన్నికల్లో 4 శాతం, అంటే 10 లక్షల మంది నోటాకు ఓటు వేశారు. వీళ్లంతా ఎవరి మీద చూపిస్తారు కోపం. అత్తమీద కోపం దుత్త మీద చూపిస్తారా? ఓటు వస్తే మనకు హక్కు వస్తుంది. మార్పు కోసం చూస్తున్న వాళ్లు జనసేనకు ఓటు వేస్తే భీమిలి లాంటి చోట సందీప్ పంచకర్లకు ఓటు వేస్తే.. అతణ్ని ప్రశ్నించే హక్కు వస్తుంది. ఇలా నోటాకు ఓటు వేసిన వాళ్ల వల్లే క్రిమినల్స్ రాజ్యాలేలుతున్నారు. మీరు పరోక్షంగా వాళ్లకు సపోర్ట్ చేస్తున్నారు. దయచేసి ఎక్కువమంది ఓటు వేయడానికి రండి. ఎవరికో ఒకరికి ఓటు వేయండి” అని పవన్ జనసేన సమావేశంలో పేర్కొన్నాడు.