పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన సమావేశంలో.. మీడియా ముఖంగా చెప్పు తీసి మరీ వైసీపీ నేతల్ని కొడతానంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యల గురించి తెలిసిందే. చెప్పు చూపిస్తూ.. ‘నా కొడకల్లారా’ అంటూ ఆవేశపూరితంగా పవన్ నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలపై.. ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సైతం స్పందించటం.. పవన్ పేరును ప్రస్తావించకుండా.. వ్యాఖ్యలు చేయటం.. చెప్పు చూపించిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. ఇదెక్కడి రాజకీయం అంటూ ఆయన నోటి నుంచి వ్యాఖ్యలపై తాజాగా జనసేనాని రియాక్టు అయ్యారు.
తన నోటి నుంచి కొడకల్లారా అన్న మాటకు.. ఇష్టారాజ్యంగా బూతులు తిట్టారంటూ సీఎం జగన్ తో సహా అందరూ ఆరోపిస్తున్న వేళ.. తన మాటలు.. చేతలపై పవన్ కల్యాణ్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేయటంతో పాటు.. చెప్పు చూపించిన వైనంపై ఫుల్ క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయటం గమనార్హం. తానేదో ఆవేశంతోనో.. ఆగ్రహంతోనో.. మైలేజీ కోసమో ఆ పని చేయలేదన్న విషయాన్ని ఆయన స్పష్టం చేశారు. తాను చెప్పు చూపించిన వైనం వెనుక తీవ్రమైన ఆవేదన ఉందన్న విషయాన్ని పవన్ చెప్పే ప్రయత్నం చేయటం విశేషం.
‘ఇంట్లోని మహిళల్ని రేప్ చేసి చంపేస్తామనే వారికి పాలకులు గులాం కొడుతున్నారు. వ్యవస్థల్ని నాశనం చేసే పాలకులకు పెద్ద స్థాయి అధికారులు వంగి వంగి సలాం చేస్తున్నారు. ఇలాంటి పాలకులకు చెప్పు చూపించకుండా ఇంకేం చూపిస్తాం?’ అంటూ ప్రశ్నించారు పవన్ కల్యాణ్. వైసీపీ నేతలు ఏ భాషలో మాట్లాడితే.. ఆ భాషలోనే తాము సమాధానం ఇస్తామంటూ విరుచుకుపడ్డ పవన్.. ‘‘చట్టాన్ని అపహాస్యం చేసేలా ఉగ్రవాదులు రాష్ట్రాన్ని పాలించటం మన దౌర్భాగ్యం. 2024లో జనసేన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని.. సుగాలీ ప్రీతి కేసును తొలుత చేపడతాం. నేరమయ రాజకీయాల్ని చేసే వైసీపీ నేతలకు ఐపీఎస్ అధికారులు సెల్యూట్ కొడుతున్నారు.
విశాఖ పర్యటన సందర్భంగా తనపై దాడికి ప్లాన్ చేశారన్న పవన్.. తన పర్యటన సందర్భంగా విశాఖలో చేపట్టే విధ్వంసంపై ఐదు రోజుల ముందే తన శ్రేయోభిలాషుల ద్వారా తనకు పక్కా సమాచారం అందినట్లు చెప్పారు. తాను అన్నింటికి తెగించే విశాఖకు చేరుకున్నట్లుగా చెప్పారు. విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్రను విధ్వంసం చేయాలని వైసీపీ ప్రభుత్వం చూస్తుందన్నారు. తాను అన్నింటికి తెగించి మరీ విశాఖలో కాలు పెట్టినట్లుగా చెప్పారు. విశాఖకు వెళ్లిన తర్వాత ప్రభుత్వ కుట్ర అర్థమైనా.. పోలీసులు బెదిరింపులకు గురి చేసినా.. సహనంతో ఉన్నట్లుగా చెప్పారు. విశాఖ ఎపిసోడ్ జరిగిన ఇంతకాలానికి.. తనపై దాడికి కుట్ర జరిగిందంటూ పవన్.. ఆయన పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. దీనికి వైసీపీ ప్రభుత్వం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.