ఏపీలో బీజేపీకి అభ్యర్థులు ఎక్కడ !

రాష్ట్రంలో బీజేపీ ప‌రిస్థితి ఏంటి? ఎలా ముందుకు సాగాలి? ఎంత‌సేపూ.. కేంద్రంపైనే ఆధార‌ప‌డాలా? లేక మనకంటూ.. ఏమైనా ఆలోచ‌న ఉందా? ఇదీ.. బీజేపీ రాష్ట్ర‌నాయ‌కుల్లో జ‌రుగుతున్న చ‌ర్చ‌. తాజాగా ఇదే విష‌యంపై కొంద‌రు నాయ‌కులు కూడా.. పార్టీ చీఫ్ సోము వీర్రాజును క‌లిశారు. రాష్ట్రం లోని రెండు ప్ర‌దాన పార్టీలు దూకుడుగా ముందుకుసాగుతున్నాయి. మ‌రి మ‌న సంగ‌తి ఏంటి? అనివారు ప్ర‌శ్నించారు. ఎందుకంటే.. అటు వైసీపీ అయినా.. ఇటు టీడీపీ అయినా.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా.. స‌మీక్ష‌లు చేస్తున్నాయి. నాయ‌కుల‌కు అలెర్టు చేస్తున్నారు.

కొంద‌రికి ఇంపార్టెంట్ అనుకున్న వారికి టికెట్లు కూడా.. క‌న్ఫ‌ర్మ్ చేస్తున్నారు. అదేస‌మ‌యంలో నియోజ‌క‌వ‌ర్గాల వారీగా స‌మీక్ష‌లు చేసి.. నాయ‌కులు క‌లిసి క‌ట్టుగా.. క‌ద‌న‌రంగంలోకి దింపేలా వ్యూహాత్మ‌కంగా వైసీపీ, టీడీపీలు అడుగులు వేస్తున్నాయి. దీంతో అంతో ఇంతో ఆయా పార్టీల్లో జోష్ క‌నిపిస్తోం ది. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న బీజేపీ నాయ‌కులు.. వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి మ‌న‌ప‌రిస్థితి ఏంటి? అనే ప్ర‌శ్న‌లు సంధిస్తున్నారు. ఎందుకంటే.. నియోజ‌క‌వ‌ర్గాల వారీగా పార్టీని బ‌లోపేతం చేయాల‌ని కొంద‌రు భావిస్తున్నారు. దీంతో స‌మీక్ష‌ల‌కు ప‌ట్టుబ‌డుతున్నారు.

నిజానికి సోము వీర్రాజు కూడా.. రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. ఆయ‌న‌కు కూడా.. పార్టీని బ‌లోపేతం చేయాల‌నే ఉంది. కానీ, నియోజ‌క‌వర్గాల వారీగా స‌మీక్ష‌లు చేసేందుకు.. ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లో ఇంచార్జులు లేకుండా పోయారు. దీంతో ఆయ‌న ఈవిష‌యంలో సైలెంట్ అయిపోయారు. ఎక్క‌డ చూసుకున్నా.. నాయ‌కుల కొర‌త పార్టీని వెంటాడుతోంది. పైకి ఎంతో గంభీరంగా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని.. చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో వెనుదిరిగి చూసుకుంటే మాత్రం ప‌రిస్థితి దీనికి భిన్నంగా ఉంది.

ఎక్క‌డా కూడా.. ఆశించిన స్థాయిలో నాయ‌కులు లేరు. 175 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప‌ట్టుమ‌ని 60 మంది కూడా నాయ‌కులు నిక‌రంగా.. పార్టీకి క‌నిపించ‌డం లేదు. పోనీ.. పార్టీలో నేత‌లు లేరా.. అంటే, ఉన్నారు. కానీ, వారంతా.. పోటీలో నిలిచి గెలిచే క్యాండెట్లు కారు. సో.. ఈ ప‌రిణామాల‌తోనే.. నియోజ‌క‌వ‌ర్గాల స‌మీక్ష కానీ, నియోజ‌క‌వ‌ర్గాల్లో పార్టీని బ‌లోపేతం చేయాల‌న్న ఆలోచ‌న కానీ.. బీజేపీ చేయడం లేదు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీని ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.