తుమ్మ‌ల బ్యాక్.. టీడీపీలో జోష్‌!

సీనియ‌ర్ నాయ‌కుడు, వివాద ర‌హిత నేత‌, తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు అంద‌రికీ సుప‌రిచితులే. తెలంగాణలోని ఉమ్మ‌డి ఖ‌మ్మం జిల్లాలో చ‌క్రం తిప్పిన ఆయ‌న టీడీపీలో ఉండ‌గా మంత్రిగా కూడా ప‌నిచేశారు. జిల్లాను శాసించే స్థాయికి ఎదిగారు. అయితే, తెలంగాణ ఆవిర్భావం త‌ర్వాత టీడీపీ కొంత వెనుక బ‌డ‌డంతో ఆయ‌న త‌న రాజ‌కీయాల‌ను మార్చుకుని తెలంగాణ రాష్ట్ర‌స‌మితిలోకి వెళ్లిపోయారు. అయితే.. ఇక్క‌డ మారిన రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో మ‌ళ్లీ ఆయ‌న టీడీపీ సైకిల్ ఎక్కేందుకు రెడీగా ఉన్నార‌నే చ‌ర్చ జోరుగా సాగుతుండ‌డం గ‌మ‌నార్హం.

ఏం జ‌రిగింది?
తెలంగాణ ఏర్ప‌డ‌క‌ముందు వ‌ర‌కు టీడీపీలో ఉన్న తుమ్మ‌ల ఉమ్మ‌డి ఖ‌మ్మంలో ఎదురులేని నాయ‌కుడిగా చ‌క్రం తిప్పారు. తెలంగాణ ఏర్ప‌డ్డాక కూడా ఆయ‌న టీడీపీలోనే ఉన్నారు చంద్ర‌బాబుకు ఎంతో ముఖ్య‌నాయ‌కుడిగా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. అయితే, పార్టీ బ‌ల‌హీన‌ప‌డ‌డం, చంద్ర‌బాబు ఒకానొక‌ద‌శ‌లో తెలంగాణ టీడీపీని ప‌ట్టించుకోక‌పోవ‌డంతో ఆయ‌న టీఆర్ఎస్ వైపు మొగ్గుచూపారు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌కు కూడా ఆయ‌న స‌న్నిహిత నాయ‌కుడిగా మారిపోయారు. ఖ‌మ్మంలో వ‌చ్చిన ఉప ఎన్నిక‌లో పోటీ చేసి విజ‌యంద‌క్కించుకుని కేసీఆర్ మంత్రి వ‌ర్గంలో చోటు ద‌క్కించుకున్నారు.

అయితే.. గ‌త ఎన్నిక‌ల్లో మాత్రం తుమ్మ‌ల‌కు ఓట‌మి ఎదురైంది. అయినా ఆయ‌న పార్టీకోసం ప‌నిచేస్తూనే ఉన్నారు. కానీ, ఇక్క‌డ నుంచి గెలిచిన కాంగ్రెస్‌నేత ఉపేంద‌ర్‌రెడ్డి టీఆర్ఎస్లో చేర‌డం, ఆయ‌న‌కు కేటీఆర్ మ‌ద్ద‌తు ఇవ్వ‌డంతో తుమ్మ‌ల‌కు ప్రాధాన్యం త‌గ్గిపోయింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అస‌లు టికెట్ ఇస్తారో లేదో కూడా తెలియ‌ని ప‌రిస్థితి నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఆయ‌న టీడీపీవైపు చూస్తున్నార‌నే వార్త‌లు వ‌స్తున్నాయి. తాజాగా టీడీపీ వ్య‌వ‌స్థాప‌క అధ్య‌క్షుడు ఎన్టీఆర్ శ‌త‌జ‌యంతిని పుర‌స్క‌రించుకుని నిర్వ‌హించిన కార్య‌క్ర‌మానికి ఆయ‌న హాజర‌య్యారు.

ఎన్టీఆర్ విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. ఎన్టీఆర్ పాల‌న‌ను కొనియాడారు.అనంతంర స‌త్తుప‌ల్లిలో నిర్వ‌హించి బైక్ ర్యాలీలోనూ ఆయ‌న పార్టిసిపేట్ చేశారు. ఎన్టీఆరే త‌న‌కు రాజ‌కీయ జ‌న్మ ఇచ్చార‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ను తిరిగి టీడీపీలోకి రావాలంటూ కార్య‌క‌ర్త‌లు డిమాండ్ చేశారు. 2018లో తీవ్ర స‌మ‌రం జ‌రిగినా టీడీపీ రెండు సీట్లు గెలుచుకుంది. ఈ విష‌యాన్ని కూడా ప్ర‌స్తావించారు. తుమ్మ‌ల రావాల‌ని కొంద‌రు ప‌ట్టుబ‌ట్టారు.

ఇక తుమ్మ‌ల క‌నుక టీడీపీ తీర్థం పుచ్చుకుంటే.. ఖ‌చ్చితంగా పార్టీ పుంజుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. 2023లో వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న గెలుపు ఖాయ‌మ‌నే లెక్క‌లు వేస్తున్నారు. ఇటీవ‌లే కాసాని జ్ఞానేశ్వ‌ర్ చేరిక‌తో బీసీలు అంద‌రూ ఇప్పుడు మ‌రోసారి టీడీపీవైపు చూస్తున్నారు. మ‌రి తుమ్మ‌ల ఏం చేస్తారో చూడాలి ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఆయ‌న‌కు బెస్ట్ ఆప్ష‌న్ టీడీపీయేన‌ని ఆయ‌న అనుచ‌రులు సైతం చెబుతుండ‌డం గ‌మ‌నార్హం.