వైసీపీకి ఈ ఒక్క ఎన్నికే ఎందుకు ప్ర‌తిష్టాత్మ‌కం..?

వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌.. ఇటీవ‌ల కాలంలో నియోజ‌క‌వ‌ర్గం పార్టీ పెద్ద‌లు, ఇంచార్జ్‌ల‌తో వ‌రుస భేటీలు అవుతున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో పార్టీ గెలిచి తీరాల‌ని.. ఎట్టి ప‌రిస్థితిలోనూ.. అధికారం మ‌నదే కావాల‌ని కూడా.. వారికి సూచిస్తున్నారు. ఈ క్ర‌మంలోకొన్ని కొన్ని విష‌యాల‌ను కూడా.. ఎలాంటి దాప‌రికం లేకుండా చెప్పేస్తున్నారు. వ‌చ్చే ఎన్నిక‌లు ఎంత బలంగా ఉన్నా.. వాటిని ఎదుర్కొనాలి. వాటిలో విజ‌యం ద‌క్కించుకోవాలి. ఆ త‌ర్వాత‌.. 30 ఏళ్ల పాటు మ‌న‌కు తిరుగు ఉండ‌దు అని ప‌దే ప‌దే.. సీఎం జ‌గ‌న్ చెబుతున్నారు. వాస్త‌వానికి ఇది కొత్త‌కాదు.

కానీ, ఇటీవ‌ల కాలంలో ఆయ‌న చేస్తున్న నియోజ‌క‌వ‌ర్గం స‌మీక్ష‌ల్లో.. మాత్రం దీనిని పెద్ద‌గా వినిపిస్తున్నారు. ఎవ‌రూ కూడా.. నిర్ల‌క్ష్యంగా ఉండొద్ద‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం క‌ష్ట‌ప‌డితే.. ఆపై వ‌చ్చే.. 25 సంవ‌త్సరాలు కూడా.. మ‌న‌కు తిరుగులేద‌ని.. అడ్డు ఉండ‌ద‌ని.. కూడా.. జ‌గ‌న్ చెబుతున్నారు. దీంతో ఇప్పుడు నాయ‌కులు.. అంద‌రూ.. కూడా.. ఈ దిశ‌గానే అడుగులు వేస్తున్నారు. ఇక వైసీపీ అధినేత చెబుతున్న ఈ విష‌యాన్ని ప‌రిశీలిస్తే.. రెండు కీల‌క‌ విష‌యాలు తెర‌మీదికి వ‌స్తున్నాయి. ఒక‌టి..పార్టీ శ్రేణుల్లో ఉన్న మితి మీరిన విశ్వాసాన్ని పక్క‌న పెట్టేలా చేయ‌డం.

రెండు.. నిజంగానే.. ఇప్పుడున్న ప‌రిస్థితులు వైసీపీకి అనుకూలంగా లేవ‌ని.. సీఎం జ‌గ‌న్ భావిస్తుండ‌డం. ప్ర‌స్తుతం వైసీపీ నాయ‌కుల్లో.. మితిమీరిన విశ్వాసం క‌నిపిస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌యం త‌మ‌దేనని.. త‌మ‌కు తిరుగులేద‌ని.. ఇలా.. వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కార‌ణం.. ప్ర‌భుత్వం అంద‌జేస్తున్న వివిధ సంక్షేమ కార్య‌క్ర‌మాలు కావొచ్చు.. లేదా.. ప‌థ‌కాలు కావొచ్చు. మొత్తంగా.. త‌మ‌కు అనుకూలంగా ఇప్పుడు ప‌రిస్థితి ఉంద‌ని భావిస్తున్న చాలా మంది నాయ‌కులు పార్టీ త‌ర‌ఫున పెద్ద‌గా ప‌నిచేయ‌డం లేద‌ని.. జ‌గ‌న్ భావిస్తున్నారు.

మ‌రోవైపు.. ఇప్పుడు వ‌చ్చే ఎన్నిక‌ల్లో.. టీడీపీ అధినేత చంద్ర‌బాబు, ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఉన్న కొన్ని మీడియా సంస్థ‌లు, వ్య‌క్తులు కూడా.. చాలా యాక్టివ్‌గా ఉన్నారని, ఈ నేప‌థ్యంలో వారిని బ‌లంగా ఎదుర్కొంటున్నామ‌ని.. జ‌గ‌న్ ప‌దే ప‌దే చెబుతున్నారు. అయితే.. ఈ ఎన్నిక‌ల వ‌రకే వారి హవా ఉంటుంద‌ని.. త‌ర్వాత‌.. ఇక వారి హ‌వా ఏమీ ఉండ‌ద‌ని.. జ‌గ‌న్ చెబుతున్నారు. పైకిచూస్తే.. ఇది కూడా.. నిజ‌మేన‌ని అంటున్నారు వైసీపీ కీల‌క నాయ‌కులు. ప్ర‌స్తుతం యాక్టివ్‌గా ఉన్న చంద్ర‌బాబు. వ‌చ్చే ఎన్నిక‌ల త‌ర్వాత‌.. యాక్టివ్‌గా ఉండ‌లేక పోవ‌చ్చు. సో.. దీనినే జ‌గ‌న్ ప్ర‌స్తావించి.. ఈ ఎన్నిక‌ల‌ను బ‌లంగా ఎదుర్కొనేందుకు రెడీ అవ్వాల‌ని ఆయ‌న చెబుతున్నారు. మ‌రి నాయ‌కులు ఏం చేస్తారో చూడాలి.