రైతుల పాద‌యాత్ర‌ పై ఏపీ స‌ర్కారు వితండ వాద‌న‌

రాజ‌ధాని అమ‌రావ‌తి నిర్మాణం స‌హా ఇక్క‌డ భూములు ఇచ్చిన రైతుల విష‌యంలో వైసీపీ స‌ర్కారు అనుస‌రిస్తున్న ధోర‌ణి ఆద్యంతం వివాదంగానే మారుతున్న విష‌యం తెలిసిందే. తాజాగా వారి పాద‌యాత్ర‌పై ఎంపీలు, మంత్రులే వ్యాఖ్య‌లు, భౌతిక దాడులు కూడా చేశారు. ఇప్పుడు తాజాగా రైతుల పాద‌యాత్ర‌ను నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాల‌ని కోరుతూ హైకోర్టులో పిటిష‌న్ వేసింది ఏపీ స‌ర్కారు. అమరావతి రైతుల పాదయాత్రకు అనుమతి రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం.. హైకోర్టును కోరింది.

అయితే త‌మ పాద‌యాత్ర‌కు ప్ర‌భుత్వ అడ్డంకులు లేకుండా చూడాలంటూ రైతులు వేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ చేపట్టింది. పాదయాత్రలో 600 మంది రైతులు మొదటి నుంచి చివరి వరకు పాల్గొనడం కష్టమని రొటేట్‌ అవుతుంటారని రైతుల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిం చారు. మహిళలు ఎక్కువ మంది ఉండటంతో వారి సమస్యలు కూడా దృష్టిలో ఉంచుకోవాలన్నారు. పాదయాత్రలో పాల్గొనే వారికి ముందు, వెనుక సంఘీభావం తెలిపే గ్రామస్థులు ఉంటారని చెప్పారు. సంఘీభావం తెలిపేవాళ్లు రోడ్డుకు ఇరువైపులా ఉండాలని మొదటి ఉత్తర్వుల్లో లేదని చెప్పారు.

రైతులకు సంఘీభావం తెలిపేవారు భోజనాల ఏర్పాటు, వసతి కల్పించడం, విరాళాలు అందించడం చేస్తుంటారని న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. న్యాయస్థానం మధ్యాహ్నం 12.30 గంటలకు ఉత్తర్వులు జారీచేస్తే ఆ కాపీ రాకముందే పోలీసులు ఆంక్షలు విధించారని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఆంక్షలు విధించడంతో పాటు రైతులు భోజనం చేసే ఫంక్షన్‌ హాల్‌కు వెళ్లి ఐడీ కార్డులు చూపించమన్నారని తెలిపారు. డీజీపీ కార్యాలయం నుంచి 150 మందికి మాత్రమే కార్డులు ఇచ్చారన్నారు.

అనంతరం ప్రభుత్వం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ తమకు సమయం కావాలని కోరారు. పోలీసు ఆంక్షల కారణంగా తాము పాదయాత్రను బలవంతంగా వాయిదా వేసుకోవాల్సి వచ్చిందని అందువల్ల వెంటనే విచారించాలని పిటిషనర్లు కోరారు. రేపు అన్ని పిటిషన్లను కలిపి విచారించి ఉత్తర్వులు జారీ చేస్తామని హైకోర్టు తెలిపింది. ప్రభుత్వం, పిటిషనర్లు ఆచరణ యోగ్యమైన ప్రతిపాదనలతో రావాలని స్పష్టం చేసింది.