కమెడియన్ ఆలీకి.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎంత మంచి ఫ్రెండో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. పవన్‌తో రెండు దశాబ్దాలకు పైగా అనుబంధం ఉన్న ఆలీ.. తన మిత్రుడు జనసేన పేరుతో కొత్త పార్టీ పెడితే.. పార్టీ ఆఫీసుకు వచ్చి ఖురాన్ చదివి ఆ పార్టీకి అంతా మంచి జరగాలని కోరుకున్నాడు.
అప్పటి ఆలీ తీరు చూస్తే జనసేనలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ 2019 ఎన్నికల ముంగిట పవన్‌కు షాకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడమే కాక ఆ పార్టీ కోసం విస్తృతంగా ప్రచారం చేసి పెట్టాడు.
ఐతే అంతకంటే ముందు ఆలీకి తెలుగుదేశం పార్టీ నుంచి కూడా ఆహ్వానం రావడం తెలిసిందే. ఐతే తనకు ఏ పార్టీ పదవి ఇస్తే ఆ పార్టీలో చేరతానని చాలా క్లియర్‌గా ఓ మీడియా ఇంటర్వ్యూలో చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఆలీ. వైకాపాలో చేరినపుడు రాజ్యసభ సభ్యత్వం కోసం ప్రపోజల్ పెట్టినట్లు కూడా వార్తలొచ్చాయి.
ఇక జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక ఎంపీ పదవి కాకపోయినా కనీసం వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అయినా ఇస్తారని ఆశించాడు ఆలీ. కానీ చూస్తుండగానే మూడేళ్లకు పైగా గడిచిపోయాయి. ఆలీ ఆశించిన పెద్ద పదవులేవీ ఆయనకు దక్కలేదు.
ఇప్పుడేమో కంటితుడుపుగా ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు అంటూ నామమాత్రపు పదవి ఒకటి ఆయనకు పడేశాడు జగన్. ఇప్పటికే జగన్ ప్రభుత్వం పెట్టుకున్న 40 మందికి పైగా సలహాదారుల్లో ఆలీ ఒకడు. ఆ పదవి అలంకార ప్రాయం. మహా అయితే ఈ పదవిలో ఒకటిన్నర సంవత్సరం ఉంటాడు ఆలీ.
ఆ కాలానికి కొన్ని లక్షల జీతం, సౌకర్యాలు కల్పిస్తారు. అంతకుమించి ఏమీ ఉండదు. దీని బదులు పదవి తీసుకోకుండా ఉంటేనే ఆలీకి గౌరవంగా ఉండేది. పదవి ఇచ్చామనిపించారు. కానీ దానికి ప్రాధాన్యం లేదు. ఒక హోదా, గౌరవం లాంటివి ఏమీ రావు. కేవలం ఏడాదిన్నర పాటు కొన్ని లక్షల జీతం కోసం ఆలీ ఇంత చేశాడా అన్న చర్చ నడుస్తోందిప్పుడు.
ఎన్నో విమర్శలెదుర్కొని, ఇమేజ్ డ్యామేజ్ చేసుకుని వైకాపా కోసం ఆలీ అంత కష్టపడితే.. నామమాత్రపు పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నాడు జగన్. అందులోనూ ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత నెలకొన్న సమయంలో, ఈ సలహాదారులు పదవుల విమర్శలు తీవ్ర విమర్శలు వస్తున్నపుడు ఈ పదవి చేపట్టాల్సి రావడం ఆలీకి తీవ్ర ఇబ్బందికరమే. ఈ విషయంలో ఆలీది కక్కలేని, మింగలేని పరిస్థితి అనే చెప్పాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates