వైసీపీ నాయకుడు నటుడు, కమెడియన్ మహమ్మద్ అలీకి.. ఏపీ ప్రభుత్వం పదవిని కట్టబెట్టింది. ఆయనను ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా.. నియమిస్తూ.. తాజాగా ప్రభుత్వం జీవో ఇష్యూ చేసింది. వాస్తవానికి 2014 ఎన్నికల కు ముందు నుంచి అలీ.. వైసీపీలోనే ఉన్నారు అప్పట్లో రాజమండ్రి ఎంపీ టికెట్‌ను ఆయన ఆశించారు. కానీ, ఇవ్వలేదు. అదేసమయంలో గుంటూరు వెస్ట్ నియోజకవర్గం నుంచి టికెట్ ఇవ్వమని కోరారు. అది కూడా సాధ్యం కాలేదు. ప్రభుత్వంలోకి వస్తే.. మంచి పదవి ఇస్తామని.. అప్పట్లో జగన్ హామీ ఇచ్చారు.
కానీ, 2014 ఎన్నికల్లో ప్రభుత్వంలోకి వైసీపీ రాలేదు. అయినా.. అలీ.. మాత్రం వైసీపీ బాటలోనే నడిచారు. 2019 ఎన్నికల్లోనూ.. ఆయన ప్రచారం చేశారు. అప్పట్లోనూ.. టికెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. ఇవ్వాలని అనుకున్నా కుదరలేదు. దీంతో మళ్లీ యధారాజా.. అన్నట్టుగా.. ఆయన జగన్ తోనే ఉన్నారు. ఇక, ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత.. అనేక ఊహాగానాలు తెరమీదికి వచ్చాయి. వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవిని ఇస్తారని.. అలీ వర్గం ప్రచారం చేసింది. అయితే అది దక్కలేదు. ఇంతలోనే సినిమా టికెట్ల వ్యవహారంపై.. చిరుతో కలసి వచ్చిన బృందంలో అలీ ఉన్నారు.
ఈ క్రమంలోనే అలీకి రాజ్యసభ సీటు ఇస్తారంటూ.. వైసీపీ నేతలు లీకులు ఇచ్చారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చ కూడా జరిగింది. దీనిపై అలీ నర్మగర్భంగా వ్యాఖ్యానించి.. మరింత ఆసక్తి పెంచారు. జగన్ ఏ పదవి ఇచ్చినా.. తీసుకుంటానన్నారు. అయితే రాజ్యసబ సీటు కూడా కేవలం ప్రచారానికే పరిమితం అయింది. ఇక, ఇప్పుడు తాజాగా..ఆయన ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమిస్తూ.. ఉత్తర్వులు ఇచ్చారు.
అలీ.. స్థాయి ఇదేనా?
అయితే.. తాజా నియామకం పై అనేక సందేహాలు తెరమీదకి వస్తున్నాయి. సుదీర్ఘంగా పార్టీకి సేవ చేస్తున్న అలీకి ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారు పదవి ఇవ్వడం ఆయన స్థాయికి తగునా? అనేది ప్రశ్న.
అలీ వంటి బలమైన ఫాలోయింగ్ ఉన్న వారికి వక్ఫ్ బోర్డు పదవిని ఇచ్చి ఉంటే బాగుండేదని వైసీపీలోనే చర్చసాగుతోంది. ఇప్పటికే సలహాదారులు కోకొల్లలుగా పెరిగిపోయిన నేపథ్యంలో ఆయన కూడా అందులో ఒకరుగా ఉంటారు తప్ప ప్రయోజనం ఇటు ఆయనకు కానీ అటు పార్టీకి కానీ ప్రభుత్వానికి కానీ ఉండేది లేదని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates