కేటీఆర్ నోట‌.. అమ‌రావ‌తి మాట‌!

తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ నాయ‌కుడు.. కేటీఆర్ స‌హ‌జంగా.. ఏపీలోని లోపాల‌ను ఎత్తి చూపేందుకు.. ప్రాదాన్యం ఇచ్చే విష‌యం తెలిసిందే. గ‌తంలో త‌న స్నేహితులు.. ఏపీలో ఉన్నార‌ని.. వారు అక్క‌డి రోడ్ల దుస్థితిని త‌న‌కు చెప్పార‌ని.. కేటీఆర్ వ్యాఖ్యానించి.. రాజ‌కీయంగా మంట‌లు రేపారు. అయితే.. త‌ర్వాత‌.. త‌ను ఆ ఉద్దేశంతో అన‌లేదంటూ.. వ్యాఖ్యానించారు. స‌రే.. ఆ ఎపిసోడ్ అక్క‌డితో ముగిసిపోయింది. అయితే.. తాజాగా ఆయ‌న ఓ మీడియాతో మాట్లాడుతూ.. ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తి గురించి మాట్లాడారు. అదేంటి అనుకుంటున్నారా? నిజ‌మే. ఎప్పుడూ.. ఇప్ప‌టి వ‌ర‌కు అటు కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇత‌ర మంత్రులు కానీ.. అమ‌రావ‌తి గురించి మాట్లాడ‌లేదు.

అయితే..తాజాగా.. కేటీఆర్ మాత్రం అమ‌రావ‌తి గురించి మాట్లాడారు. బీజేపీని దుయ్య‌బడుతూ.. ఆయ‌న వ్యాఖ్య‌లు చేస్తూ.. మ‌ధ్య‌లో అమ‌రావ‌తి ప్ర‌స్తావ‌న తెచ్చారు. దేశంకోసం, ధర్మం కోసం అనే బీజేపి… యాదాద్రికి వంద రూపాయలివ్వదు, అమరావతికి తట్టెడు మట్టి, లొట్టెడు నీళ్ళు ఇవ్వదు. మీరా హిందుత్వం గురించి, దేశం గురించి మాట్లాడేది….?? అని కేటీఆర్ సూటి ప్రశ్న సంధించారు. అంతేకాదు.. మోడీ తెలంగాణ‌కు అనేక ప‌థ‌కాలు ప్ర‌క‌టించార‌ని.. అయితే.. ఒక్క‌టికూడా సాధించ‌లేని వారు ఇప్పుడు ఓట్ల కోసం ఇల్లిల్లు తిరుగుతున్నార‌ని.. ఎద్దేవా చేశారు. ఇలాంటి వారిని ప్ర‌జ‌లు న‌మ్మ‌ర‌ని చెప్పారు.

అయితే.. కేటీఆర్ అమ‌రావ‌తి వ్యాఖ్య వెనుక‌.. చాలా వ్యూహం ఉండే ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌టి.. మునుగోడులోని ఓటర్ల‌ను త‌మ‌వైపు తిప్పుకోవ‌డంతో పాటు.. సెటిల‌ర్ల‌ను కూడా.. త‌మ‌వైపు మ‌లుచుకునే వ్యూహం ఉంద‌నే భావ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. లేక పోతే.. ఆక‌స్మికంగా.. ఇంత హ‌ఠాత్తుగా.. కేటీఆర్ నోటి నుంచి ఇలా అమ‌రావ‌తి సింప‌తీ వ్యాఖ్య‌లు ఎందుకు వ‌స్తాయ‌ని.. అంటున్నారు. రాజ‌ధాని రైతులు.. రోజుల త‌ర‌బ‌డి పాద‌యాత్ర చేసి.. పోలీసుల‌తో దెబ్బ‌లు తిన్న‌ప్పుడు కూడా.. ఇలా కేటీఆర్ స్పందించ‌లేద‌ని వ్యాఖ్యానిస్తున్నారు. ఏదేమైనా.. అమ‌రావ‌తిపై కేటీఆర్ వ్యాఖ్య‌లు ఆస‌క్తిని రేపుతున్నాయి.