విశాఖకు ఎవ‌రూ వెళ్ల‌కూడ‌దా? వైసీపీ ఎందుకు భ‌య‌ప‌డుతోంది?

ఇప్పుడు రాష్ట్ర ప్ర‌జ‌ల్లో ఇదే ప్ర‌శ్న త‌లెత్తుతోంది. వైసీపీ నేత‌లు త‌ప్ప‌.. విశాఖ‌ప‌ట్నం మ‌హానగ‌రంలో ప్ర‌తిప‌క్షానికి చెందిన నాయ‌కులు ఎవ‌రు అడుగు పెట్ట‌కూడ‌ద‌నేలా అధికార పార్టీ నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్న వైనాన్ని మేధావులు సైతం త‌ప్పుప‌డుతున్నారు. ఇదేం చోద్యం.. ఇదే ప‌ద్ధతి? అని వారు ప్ర‌శ్నిస్తున్నారు. విశాఖ‌ప‌ట్నంలో గ‌త ఏడాది కింద‌ట టీడీపీ అధినేత‌ చంద్ర‌బాబు పర్య‌టించాల‌ని భావించారు. అయితే.. అప్ప‌ట్లోనూ ఆయ‌న‌ను విశాఖ విమానాశ్ర‌యం వ‌ద్దే పోలీసులు అడ్డుకున్నారు. దీంతో చంద్ర‌బాబు తీవ్ర ఆవేద‌నకు గుర‌య్యారు.

దీనిపై కోర్టులోనూ కేసులు న‌డిచాయి. అయినా.. స‌ర్కారు తీరు మార‌లేదనే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. తాజాగా జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా విశాఖ‌లో ప‌ర్య‌టించాల‌ని.. జ‌న‌వాణి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని భావించారు. అయితే.. ఆయ‌న‌ను కూడా అడ్డుకున్న‌ట్టుగానే ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించింద‌ని.. విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నారు. నిజానికి ఇలా ఎందుకు చేస్తున్నారో.. వైసీపీలోనూ.. చ‌ర్చ జ‌రుగుతుండ‌డం గ‌మ‌నార్హం. విశాఖ‌ను పాల‌నా రాజ‌ధానిగా చేయాల‌ని వైసీపీ అధిష్టానం నిర్ణ‌యించుకుంది. ఈ క్ర‌మంలో దీనికి వ్య‌తిరేకంగా వారు మాట్లాడ‌తార‌ని భ‌య‌ప‌డుతోందా? అనే సందేహాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

మ‌రోవైపు మూడు రాజ‌ధానుల‌కు మొగ్గు చూపుతున్న వైసీపీ.. ఈ దిశ‌గా విశాఖ‌ను పాల‌నా రాజ‌ధాని చేస్తామ‌ని చెబుతోంది. అయితే.. దీనికి సంబంధించి ఇక్క‌డ ప్ర‌జ‌ల‌నుంచి అనుకున్న విధంగా జోష్ క‌నిపించ‌డం లేద‌నేది ఆ పార్టీ నేత‌ల్లోనే జ‌రుగుతున్న చ‌ర్చ‌. చోడ‌వ‌రం ఎమ్మెల్యే క‌ర‌ణం ధ‌ర్మ‌శ్రీ రాజీనామా చేసినా.. మంత్రులు గ‌ర్జ‌న పేరుతో హ‌డావుడి చేసినా.. ప్ర‌జ‌ల నుంచి స్పంద‌న రాలేదు. ఈ నేప‌థ్యంలో వైసీపీ ఇత‌ర పార్టీల‌కు చెందిన నాయ‌కులు.. విశాఖలో అడుగుపెట్టి రాజ‌ధానికి వ్య‌తిరేకంగా ఏమైనా వ్యాఖ్య‌లు చేస్తే.. అది త‌మ‌కు మైన‌స్ అవుతుంద‌ని భావిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

ఈ నేప‌థ్యంలో కీల‌క పార్టీల నాయ‌కులు.. ప్ర‌జ‌ల‌ను ప్ర‌భావితం చేసే నేత‌ల‌ను అసలు.. విశాఖ‌లోకి అడుగు పెట్టకుండా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తోంద‌నే వాద‌న బ‌లంగా వినిపిస్తోంది. అయితే.. ఇది మంచి ప‌రిణామం కాద‌ని.. రేపు విశాఖ ప్ర‌జ‌ల్లో ఇదే వాద‌న బ‌ల‌ప‌డితే.. అది వైసీపీకి మొత్తానికి మేలు చేయ‌క‌పోగా.. కీడు చేస్తుంద‌ని అంటున్నారు పరిశీల‌కులు.