మునుగోడు ఉపఎన్నికల ప్రచారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సొంత పార్టీపైనే సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడులో తాను ప్రచారం చేసినా.. ప్రయోజనం లేదని అన్నారు. ఆర్థికంగా బలహీనంగా ఉన్న కాంగ్రెస్.. టీఆర్ ఎస్, బీజేపీలను తట్టుకోవటం కష్టమని వ్యాఖ్యానించారు. తీవ్ర ఉత్కంఠ రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికల వేళ ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన కోమటిరెడ్డి.. అక్కడి అభిమానులతో తన అంతరంగాన్ని పంచుకున్నారు.
ఈ సందర్భంగా ఆస్ట్రేలియాలోని తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ఎన్నారై అభిమానులు.. కోమటిరెడ్డితో భేటీ అయ్యారు. మనుగోడులో జరుగుతున్న ప్రచార తీరును అడిగి తెలుసుకున్నారు. అయితే.. వెంకటరెడ్డిమాత్రం తీవ్ర నిరుత్సాహంగా వ్యాఖ్యానించారు. మునుగోడులో తాను ప్రచారం చేసినా 10 వేల ఓట్లు వస్తాయేమో కానీ గెలిచే అవకాశాల్లేవని పరోక్షంగా వ్యాఖ్యానించారు. మెల్‌బోర్న్‌లో తనకు స్వాగతం పలికేందుకు వచ్చిన అభిమానులతో మునుగోడు ఎన్నికలు, ప్రస్తుత పరిణామాలపై వెంకట్‌రెడ్డి ముచ్చటించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
నెటిజన్ల ఫైర్
కాగా.. కాంగ్రెస్ పార్టీకి చెందిన కొందరు నెటిజన్లు.. వెంకటరెడ్డి వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్ కూడుతిని కండలు పెంచుకున్న నాయకులు ఇలాగేనా మాట్లాడేది.. ? అని నిలదీస్తున్నారు. బలహీనంగా ఉన్నప్పుడే.. కదా.. నాయకులు కలసి కట్టుగా పనిచేసి.. బలవంతం చేయాలని.. అంటున్నారు. కీలకమైన సమయంలో దోబూచులాడుతూ.. పార్టీని నట్టేట ముంచుతున్న ఇలాంటి నాయకులకు పార్టీ అధిష్టానం తగిన విధంగా బుద్ధి చెప్పాలని వారు కోరుతున్నారు. పార్టీ అధికారంలో ఉంటే పదవులు అనుభవించేందుకు ముందుకు వస్తున్న నాయకులు.. సుదీర్ఘ కాలంగా పార్టీలో ఉంటూ.. అనేక గౌరవాలు పొందుతున్న వారు ఇలా వ్యాఖ్యానించి.. పార్టీని ఏం చేయాలని అనుకుంటున్నారని.. నిలదీస్తున్నారు.