టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి శంకుస్తాపన చేసి 7 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆయన స్పందించారు. ఏడేళ్ల క్రితం ఇదే రోజున ఉద్ధండరాయునిపాలెంలో ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రజా రాజధాని అమరావతికి శంకుస్థాపన జరిగిందని, కనీసం వెయ్యేళ్లపాటు తెలుగుజాతి గుండెచప్పుడుగా అమరావతి నగరం నిలుస్తుందని ఆనాడు అందరం ఆకాంక్షించామన్నారు. పాలకుల తుగ్లక్ ఆలోచనల కారణంగా అంతా నాశనం అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.
అమరావతి అంటే 28వేల మంది రైతుల త్యాగం, కోట్ల మంది ప్రజల సంకల్పమని పేర్కొన్నారు. ప్రాంతాలకు అతీతంగా ఆంధ్రులు అమరావతిని తమకు గర్వకారణంగా భావించారని చంద్రబాబు చెప్పారు. ఎన్నికలకు ముందు అమరావతిని స్వాగతించిన వ్యక్తి… అధికారంలోకి రాగానే మాట మార్చి మోసం చేసాడని చంద్రబాబు విమర్శించారు. కోర్టులు చెప్పినా.. న్యాయ నిపుణులు చెప్పినా కూడా. ఈ ప్రభుత్వం మారడం లేదన్నారు. రాజధానిని కొనసాగించి ఉంటే.. ఇప్పటికే ప్రతిష్టాత్మక సంస్థలు వచ్చి వుండేవని తెలిపారు.
రాజధానిని నిర్మించకపోగా.. దానిని అణిచి వేసే ప్రయత్నాలు సాగుతున్నాయని చంద్రబాబు దుయ్యబట్టారు. అమరావతి రైతుల మహా పాదయాత్ర పై వైసీపీ కుతంత్రాలు సాగవని చంద్రబాబు హెచ్చరించారు. ఆంధ్రుల రాజధాని అమరావతేనని అన్నారు. అమరావతి మళ్ళీ ఊపిరి పోసుకుంటుందని చెప్పారు. 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష నెరవేరుతుందని, నిజం, న్యాయం, త్యాగం, సంకల్పం ఉన్న అమరావతే నిలుస్తుందని…. అమరావతే గెలుస్తుందని…ఇదే ఫైనల్ అని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ మేరకు చంద్రబాబు ట్వీట్ చేశారు.