ఆది నుంచి కూడా సినిమా నటులపై రాజకీయ నాయకులకు ఒక చులకన భావం ఉంది. నటులు ఏం చేస్తారులే.. అని. అయితే.. ఈవిషయంలో అన్నగారు ఎన్టీఆర్ తన సత్తా చూపించారు. తెలుగు నాట.. సినిమాల నుంచివచ్చి అధికారం చేపట్టారు. తర్వాత..ఈ రేంజ్‌లో రాజకీయాలు చేసిన వారు లేరు. అందుకే.. బహుశ ఈ మాట నిలబడిపోయి ఉంటుంది. అయితే.. సినిమా నటులు.. ప్రభుత్వ నిర్ణయాలను మార్చగలరని.. తాజాగా.. ‘కాంతార’ మూవీ నిరూపించింది. కొన్ని దశాబ్దాలుగా పట్టించుకోని సమస్యను ప్రభుత్వం పట్టించుకునేలా చేసి.. కొన్ని వేల మంది కుటుంబాల్లో కాంతులు నింపింది.
కర్ణాటకలోని ఆదివాసీ సంస్కృతిని, సంప్రదాయాన్ని ముఖ్యంగా భూతకోల నృత్యకారులను’కాంతార’ సినిమా తెరపై చూపించిన తీరు మెప్పుపొందుతోంది. అయితే.. అదేసమయంలో ఆ ఆదివాసీ సమస్యలను కూడా పరిష్కరించింది. సినిమా విషయంలో స్పందించిన కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన భూతకోల నృత్యకారులకు ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపింది. నెలకు రూ.2000 చొప్పున అర్హులైన వారందరికీ అందించనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు బెంగళూరు సెంట్రల్ ఎంపీ పీసీ మోహన్ ట్వీట్ చేశారు.
‘దైవారాధన, భూతకోల నృత్యం చేస్తూ జీవనం సాగిస్తున్న వారికి బీజేపీ నేతృత్వంలోని కర్ణాటక ప్రభుత్వం ప్రతి నెలా రూ.2000 అలవెన్స్ అందిస్తుంది. హిందూ ధర్మంలో భాగంగా భూత కోల ఒక ప్రత్యేక దైవారాధనగా ఉంది. అలవెన్స్ ఇచ్చేందుకు అంగీకరించిన ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మైకి, మంత్రి సునీల్ కుమార్ కాకర్లకు కృతజ్ఞతలు’ అని పీసీ మోహన్ పేర్కొన్నారు. సో.. సినిమా కేవలం వినోద వస్తువే కాదు.. ప్రభుత్వాలను నిర్దేశించగల వస్తువని కాంతార నిరూపించిందని అంటున్నారు పరిశీలకులు.