మునుగోడు ఉపఎన్నిక వేడిలోనే.. తెలంగాణ రాజకీయాల్లో జంపింగ్‌ల పర్వం శరవేగంగా సాగుతోంది. ఎంతలా అంటే బీజేపీలో చేరి మూడు నెలలు తిరగకముందే దాసోజు శ్రవణ్ పార్టీ మారే నిర్ణయం తీసుకున్నారు. బీజేపీకి షాక్ ఇస్తూ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు శుక్రవారం ప్రకటించారు. అంతేకాదు.. గులాబీ గూటికి ఆయన చేరనున్నట్లు సమాచారం.
ఈ మేరకు తన రాజీనామా లేఖను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు పంపినట్లు తెలుస్తోంది. మునుగోడులో బీజేపీ తీరు జుగుప్సాకరంగా ఉందంటూ లేఖలో దాసోజు పేర్కొన్నారు. దశ దిశ లేని రాజకీయ పరిణామాలకు బీజేపీ వేదిక అవుతోందని తన లేఖలో దాసోజు ఘాటుగా విమర్శించారు. ఈ సాయంత్రం కేటీఆర్ సమక్షంలో దాసోజు శ్రవణ్ టీఆర్‌ఎస్‌లో అధికారికంగా చేరనున్నట్టు శ్రవణ్ అనుచరులు చెబుతున్నారు.
ఇదిలా ఉంటే.. ఆగస్టు నెలలో కాంగ్రెస్‌ను వీడి.. తరుణ్ చుగ్, కిషన్‌రెడ్డి, పలువురు కీలక నేతల సమక్షంలో బీజేపీలో చేరారు దాసోజు శ్రవణ్. ఆ సమయంలో తాగుబోతుల తెలంగాణగా మార్చేసిందని బీజేపీ నేత దాసోజు శ్రవణ్ టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డారు. కానీ, ఇంతలోనే మనసు మార్చుకుని కారెక్కుతుండడం గమనార్హం.
ఇంతకీ దాసోజు రాసిన లేఖలో కీలక అంశాలు ఇవీ..
- సామాజిక బాధ్యత లేకుండా.. ఎన్నికలు అనగానే బీజేపీ నేతలు డబ్బుల మూటలు పంచుతున్నారు. బడా కాంట్రాక్టర్లే.. రాజ్యాలేలేలా.. పెట్టుబడి రాజకీయాలు చేస్తున్నారు.
- ప్రత్యామ్నాయ రాజకీయాలు చేస్తాం.. అని చెప్పిన మీరు మునుగోడు ఉప పోరులో అనుసరిస్తున్న రాజకీయ తీరు.. అత్యంత జుగుస్పాకరం.
- బీజేపీలో బలహీన వర్గాల నేతలకు స్థానం ఉండదని.. తేటతెల్లమైంది.
- మందు, మాంసం పంచి గెలవాలని భావిస్తున్న మీ తీరుకు నిరసనగా రాజీనామా చేస్తున్నా.