టీడీపీ అధినేత చంద్రబాబు వ్యవహార శైలిపై పార్టీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఇప్పటి వరకు నియోజకవర్గాల్లోనూ.. మండలస్థాయిలోనూ.. పార్టీ నేతలను హెచ్చరించారు. ప్రజల్లోకి వెళ్లకపోతే.. టికెట్లు ఇచ్చేది లేదని చెప్పారు. పైగా.. పార్టీ నుంచి కూడా.. పక్కకు తప్పిస్తామని హెచ్చరించారు. దీంతో నాయకులు.. చాలా మంది ప్రజల మధ్యకు వెళ్తున్నారు. ఈ పరిణామం ఇప్పుడిప్పుడే.. పుంజుకుని.. పార్టీ బలపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇలాంటి కీలక సమయంలో పార్టీ పోయి జనసేనతో పొత్తుకు రెడీ అయింది. పైకి ప్రజాస్వామ్య పరిరక్షణ కోసమని చెబుతున్నా..వచ్చే ఎన్నికల్లో పొత్తులు కళ్లకు కడుతున్నాయి.
దీంతో టీడీపీ నాయకులు తర్జన భర్జన పడుతున్నారు. ఎందుకంటే.. జనసేనతో కలిసి కనుక పోటీ చేస్తే.. 2014 నాటి పరిస్థితి ఉండదు. అప్పట్లో జనసేన పోటీకి దూరంగా ఉంది. దీంతో బీజేపీకి 10 – 15 సీట్లు కేటాయించి.. మిగిలిన వాటిలో టీడీపీనే పోటీకి దిగింది. అయితే.. ఇప్పుడు జనసేన ఎంట్రీతో .. కనీసం. 30 నుంచి 40 సీట్లు ఆ పార్టీకి కేటాయించక తప్పదని భావిస్తున్నారు. ఇవి కూడా.. ఏదో అల్లాటప్పా.. జిల్లాల్లో కాకుండా.. బలమైన తూర్పు, పశ్చిమ గోదావరి, విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం, విజయవాడ, కర్నూలు, అనంతపురంలోనే ఉంటాయని తమ్ముళ్లు లెక్కలు వేసుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు ఆయా నియోజకవర్గాల్లో మేం ఖర్చు పెట్టిందంతా వృథాయేనా? అని చర్చిస్తున్నారు.
మరోవైపు.. ఈ పొత్తులో భాగంగా జనసేనకు ఇచ్చే సీట్లుఎన్నో.. ఎక్కడో తేల్చేస్తే.. తమ పని తాము చూసుకుంటామని.. కూడా చెబుతున్నారు. ఇంకొందరు ఇదే సందేహం వ్యక్తం చేస్తూ.. నియోజకవర్గాలకు దూరంగా ఉంటున్నారు. ఎందుకంటే.. అక్కడ తాము పర్యటించినా.. ప్రజల సమస్యలు విని హామీలు ఇచ్చినా.. రూపాయి ఖర్చు చేసి కార్యకర్తలను తరలించినా.. తమకు ప్రయోజనం ఉండకపోగా.. టికెట్‌ను జనసేనకు కేటాయిస్తే.. నవ్వుల పాలవడం ఖాయమనే భావనలో తమ్ముళ్లు ఉన్నారు. దీంతో పొత్తు ప్రకటించినా.. ప్రజాస్వామ్య పరిరక్షణ అన్నా.. కూడా.. తమ్ముళ్లలో ప్రత్యేకంగా.. ఎలాంటి జోష్ కనిపించకపోవడం గమనార్హం.
అంతేకాదు.. ఇప్పటి వరకు ఒంటరి పోరుతోనే వెళ్తామని.. అంతర్గత సమావేశాల్లో కీలకనాయకులు చెప్పుకొచ్చారు. టీడీపీ పుంజుకుంటోందని.. ప్రభుత్వంపై వ్యతిరేకత అంతా కూడా తమకు కలిసి వస్తోందని.. అంటున్నప్పుడు.. ఇప్పుడు అనూహ్యంగా.. పొత్తలు ఎందుకని వారు ప్రశ్నిస్తున్నారు. పొత్తులు పెట్టుకుంటే.. బలయ్యేది తామేకదా.. అని నిష్టూరంగా అంటున్నవారు కూడా కనిపిస్తున్నారు. “బాలయ్య టికెట్‌కు నష్టం లేదు. లోకేష్‌బాబుకు నష్టం లేదు. చంద్రబాబుకు నష్టం లేదు. పోతే మేమేగా!” అనే కామెంట్లు వినిపిస్తుండడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates