“ఇంత జరిగిన తర్వాత.. కూడా.. అలా మాట్లాడతావేంట్రా!” సహజంగా మన ఇళ్లలో తరచుగా వినిపించేమాట. ఇప్పుడు.. ఇదే రేంజ్‌లో ఏపీ బీజేపీలోనూ ఈమాటే వినిపిస్తోంది. కీలకమైన బీజేపీ పొత్తు పార్టీ.. జనసేన అనూహ్యంగా టీడీపీతో చేతులు కలిపింది. కారణం ఏదైనా.. బీజేపీకి నామమాత్రం కూడా.. చెప్పలేదన్నది వాస్తవం. అంతేకాదు.. బీజేపీ నేతలు అంటే.. గౌరవం ఉందన్న పవన్.. ఊడిగం చేయబోనని స్పష్టం చేశారు. ఇలా.. బీజేపీపై అనూహ్యమైన కౌంటర్లు కూడా పడ్డాయి. అయితే.. దీనిపై ఆచితూచి మాట్లాడాల్సిన బీజేపీ నాయకులు.. రెండు నాల్కల ధోరణి అవలంభించారు.
పవన్ ఉంటే ఎంత.. పోతే ఎంత? అంటూ.. రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ దేవధర్ నోరు పారేసుకున్నారు. చంద్రబాబు, పవన్‌లు తోడుదొంగలు అన్నారు. అంతేకాదు.. పవన్‌తో భవిష్యత్తులో తాము కలిసేది లేదని.. ఈ విషయంపై ఇప్పటికే ఒక్క స్పష్టతతో ఉన్నామని చెప్పారు. పవన్ చేసిన వ్యా ఖ్యలను ఈ సందర్భంగా ఆయన ఖండించారు. అయితే.. ఇదేసమయంలో రాష్ట్ర బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఆసక్తిగా స్పందించారు. తాము.. పవన్‌తోనే ఉన్నామని.. పవన్‌తోనే కలిసి ముందుకు వెళ్తామని వ్యాఖ్యానించారు.
పవన్‌తోనే తమ పొత్తు ఉంటుందని చెప్పారు. అయితే..ఇదే టైంలో.. పవన్-చంద్రబాబుల భేటీని తాము స్వాగతిస్తున్నామన్నారు. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని వివరించారు. కట్ చేస్తే.. ఈ ఇద్దరు నాయకులు.. బీజేపీకి ఎలాంటి దిశానిర్దేశం చేశారనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే.. ఇద్దరు కూడా ముఖ్య నేతలు.. పైగా.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతారనే పేరుకూడా తెచ్చుకున్నారు. పార్టీ జాతీయ నాయకత్వానికి నమ్మిన బంట్లుగా కూడా ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఇద్దరు కూడా చెరో లైన్ తీసుకోవడమే అందరినీ ఈ ఆశ్చర్యానికి గురి చేస్తుండడం గమనార్హం. మరి ఇలానే ముందుకు పార్టీ కేడర్(ఉంటే) ఎవరికి జై కొట్టాలి? అనేది సమస్య.
Gulte Telugu Telugu Political and Movie News Updates