అద్దంకి అభ్యర్ధిని ప్రకటించిన జగన్

jagan

వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రకాశంజిల్లా అద్దంకి అసెంబ్లీకి పోటీచేసే అభ్యర్ధిని జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. బాచిన కృష్ణ చైతన్యే పార్టీ తరపున పోటీచేస్తారని నియోజకవర్గం కార్యకర్తలతో జరిగిన సమావేశంలో చెప్పారు. కార్యకర్తలతో మాట్లాడుతు రాబోయే ఎన్నికల్లో పోటీచేసేది చైతన్యే అని చెప్పి గెలుపుకు అందరు కృషిచేయాలని గట్టిగా చెప్పారు. వైసీపీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని కాబట్టి అందరం కష్టపడితే వైసీపీ గెలుపు పెద్ద కష్టంకాదన్నారు.

నియోజకవర్గంలో ప్రస్తుతం గొట్టిపాటి రవికుమార్ టీడీపీ తరపున ప్రాతినిధ్యం వహిస్తున్నారు. రవికుమార్ వరుసగా మూడు ఎన్నికల్లో గెలిచి హ్యాట్రిక్ సాధించారు. విచిత్రం ఏమిటంటే మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరపున పోటీచేసి గెలిచారు. 2009లో కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచారు. 2014లో వైసీపీ అభ్యర్ధిగా పోటీచేసి గెలిచారు. ఇక 2019లో టీడీపీ అభ్యర్ధిగా గెలిచారు. మూడు ఎన్నికల్లో మూడు పార్టీల తరపున పోటీ చేసి గెలిచిన చరిత్ర బహుశా గొట్టిపాటికి మాత్రమే ఉందేమో.

మూడుపార్టీల తరపునా గెలిచారంటేనే గొట్టిపాటికి నియోజకవర్గంలో ఉన్న పట్టేంటో అర్ధమవుతోంది. మూడు ఎన్నికల్లో రెండు సార్లు కరణం బాలరామ్ ప్రత్యర్ధిగా ఓడిపోయారు. మూడో ఎన్నికలో బాచిన చెంచుగరటయ్య ఓడిపోయారు. ఆ గరటయ్య కొడుకే ఇపుడు జగన్ అభ్యర్ధిగా ప్రకటించిన చైతన్య. అభ్యర్ధి విషయంలో ఎవరికైనా అభ్యంతరాలుంటే ఇపుడే చెప్పాలని జగన్ అన్నపుడు ఎవరు మాట్లాడలేదు. తన ముందు అభ్యంతరాలు చెప్పకుండా తరువాత వ్యతిరేకంగా పనిచేస్తే ఊరుకునేదిలేదని కూడా స్పష్టంగా చెప్పారు.

ఇదే సమయంలో నియోజకవర్గంలో గడచిన మూడున్నరేళ్ళల్లో ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. నియోజకవర్గంలో ప్రభుత్వం చేసిన అభివృద్ధి గురించి నేతలు, కార్యకర్తలంతా ప్రజలకు వివరించాలన్నారు. అయితే కార్యకర్తలు మాట్లాడుతూ ప్రజలు అభివృద్ధి గురించే అడుగుతున్నారంటు చెప్పారు. దీంతో జగన్ మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలు, గ్రామ సచివాలయాలు, స్కూలు భవనాల ఆధునీకరణ, గ్రామ ఆరోగ్య కేంద్రాలు, ఆసుపత్రుల ఆధునీకరణ అభివృద్ధి కనబడుతోందికదా అంటు ప్రశ్నించారు. బహుశా కార్యకర్తలు ప్రస్తావించిన అభివృద్ధి అంటే రోడ్లేమో.