ఏపీ సీఎం జగన్ ఎక్కడా తగ్గడం లేదు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం క్లీన్ స్వీప్ చేయాలనే లక్ష్యాన్ని ఆయన మళ్లీ మళ్లీ నాయకులకు, కార్యకర్తలకు చెబుతున్నారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంపై ఆయన సమీక్షించారు. వాస్తవానికి ఇక్కడ ప్రస్తుతం టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ఎమ్మెల్యేగా ఉన్నారు. బలమైన నాయకుడిగా ఆయనకు పేరుంది. అయితే.. ఈ నియోజకవర్గంలోనూ గెలిచి తీరాలని.. జగన్ లక్ష్యం నిర్ణయించారు.
అద్దంకి నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని రీతిలో విజయం సాధించాలని సీఎం అన్నారు. క్యాంపు కార్యాలయంలో అద్దంకి నియోజకవర్గ కార్యకర్తలతో సమావేశమైన సీఎం.. అందరం కష్టపడి వచ్చే ఎన్నికల్లో 175కి 175 సీట్లు సాధించాలన్నారు. 19 నెలల్లో ఎన్నికలు రానున్నాయని, పార్టీని గ్రామస్థాయి నుంచి సన్నద్ధం చేయాల్సిన అవసరం ఉందని దిశానిర్దేశం చేశారు. పార్టీలో ఏమైనా సమస్యలు ఉంటే.. కుటుంబంగా వాటిని పరిష్కరించుకుని ముందుకు నడవాలని కార్యకర్తలకు ముఖ్యమంత్రి జగన్ దిశానిర్దేశం చేశారు.
ఇకపై వేసే ప్రతి అడుగూ ఎన్నికల దిశగా ఉండాలన్నారు. ఒకరికొకరు తోడుగా ఉంటూ.. అందరం కలిసికట్టుగా ఉంటేనే మంచి విజయాలు సాధిస్తామన్నారు. డీబీటీ ద్వారా ప్రతి ఇంటికీ మేలు చేశామన్న సీఎం.. అద్దంకి నియోజకవర్గంలో ఈ మూడు సంవత్సరాల కాలంలో రూ.1081 కోట్లు ఇచ్చామని.. 93,124 కుటుంబాలకు మేలు చేశామన్నారు. 6,382 మందికి ఇళ్లు, 9,368 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చామని.. 47,123 మందికి బియ్యం కార్డులు మంజూరు చేశామన్నారు.
ఇదే ప్రచారం చేయాలని.. జగన్ తన కార్యకర్తలకు.. నాయకులకు సూచించారు. గడపగడప కు మన ప్రభుత్వం అంటే.. కేవలం నాయకులకే పరిమితం కాదు.. కార్యకర్తలు కూడా ఈ బాధ్యత తీసుకోవాలి. అప్పుడే.. పార్టీ గెలుస్తుంది. ప్రభుత్వం చేస్తున్న మేళ్లు ప్రజల్లోకి వెళ్తాయి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోవాలి.. అని జగన్ సూచించారు. బుధవారం పొద్దు పోయే వరకు నిర్వహించిన ఈ సమావేశానికి నియోజకవర్గం నుంచి భారీ ఎత్తున కార్యకర్తలు తరలి రావడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో మాజీ ఎమ్మెల్యే గరటయ్య కుమారుడికి టికెట్ ఇవ్వాలని జగన్ నిర్ణయించారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates