ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు మంగళవారం వేగంగా మారిపోయాయి. ఇప్పటిదాకా సాత్వికంగా మాట్లాడుతూ వచ్చిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఒక్కసారిగా ఉగ్రరూపం దాల్చాడు. అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల మీద మునుపెన్నడూ లేని విధంగా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డాడు. ప్యాకేజీ, మూడు పెళ్లిళ్లు.. ఇలా వైసీపీ వాళ్లు తనను టార్గెట్ చేసే అంశాల మీద తిరుగులేని సమాధానం చెప్పాడు. దీనికే వైసీపీ వాళ్లు గింజుకుంటుంటే.. తర్వాత ఇంకో కీలక పరిణామం చోటు చేసుకుంది.
విశాఖలో పవన్ కళ్యాణ్‌ను రకరకాలుగా వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టడాన్ని నిరసిస్తూ, పవన్‌కు సంఘీభావం తెలపడానికి చంద్రబాబు విజయవాడకు వచ్చారు. పవన్‌ను కలిశారు. తర్వాత పవన్ సమక్షంలోనే మీడియాతో చంద్రబాబు మాట్లాడారు. గంటకు పైగా పవన్‌తో చంద్రబాబు సమావేశం కావడం, ఆ తర్వాత ఆయన తరఫున మీడియాతో మాట్లాడ్డం చూస్తే ఇరు పార్టీల మధ్య పొత్తు పొడవబోతోందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి.
ఐతే తెలుగుదేశం పార్టీతో జనసేన పొత్తు పెట్టుకుంటే ఆ పార్టీ ఎప్పటికీ సొంతంగా ఎదగలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ విషయం పవన్‌కు తెలియనిది కాదు. అయినా సరే.. ఆయన పొత్తుకు సిద్ధమైనట్లే కనిపిస్తున్నారు. ఇందుకు పరోక్షంగా జగన్ సర్కారే కారణమని చెప్పక తప్పదు. జనసేన తరఫున ఏ కార్యక్రమం చేయాలన్నా వైసీపీ సర్కారు అడ్డం పడుతోంది. ఆయన పర్యటనల్ని అడ్డుకుంటోంది. దీంతో వైసీపీని ఎదుర్కోవడం జనసేనను ఎదుర్కోవడం కొంచెం కష్టమవుతోంది.
పవన్‌ను స్వేచ్ఛగా వదిలేస్తే జనాల్లోకి వెళ్లేవాడు. పార్టీ కార్యక్రమాలు చేసుకునేవాడు. సొంతంగా పోటీకి సై అన్నా అనేవాడు. కానీ పదే పదే ఆయన్ని ఇబ్బంది పెట్టి తీవ్ర అసహనానికి గురి చేయడం, వైసీపీ నేతలు రెచ్చిపోయి మాట్లాడడం, అరాచకంగా వ్యవహరిస్తుండడంతో తాను ఎదగడం కంటే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దింపడమే పవన్‌కు టార్గెట్‌గా మారిపోయింది. మరోసారి జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జరిగే పరిణామాలను కూడా ఆలోచించి ఈసారి కచ్చితంగా ఆయన ప్రభుత్వానికి చెక్ పెట్టాల్సిందే పవన్ ఫిక్సయినట్లు కనిపిస్తోంది. పవన్ ఈ నిర్ణయానికి రావడానికి కచ్చితంగా జగన్ అండ్ కోనే కారణం అని చెప్పాలి. తద్వారా జగన్ సర్కారు తనకు తనే నష్టం చేసుకుంటోందని భావించాలి.