వందల మాటల్లో చెప్పలేని.. భావాన్ని.. ఒక్క ఫొటో ప్రతిబింబిస్తుందని అంటారు. ఇప్పుడు ఓ ఫొటో.. రాష్ట్ర వ్యాప్తంగా.. వైరల్ అవుతోంది. దాదాపు అందరి సెల్ ఫోన్లలోనూ.. కదలాడుతోంది. అదే.. ఏపీ రాజధాని అమరావతి రైతుల పాదయాత్రకు సంబంధించిన ఫొటో. వాస్తవానికి రైతులు మహాపాదయాత్ర 2.0 ను ప్రారంభించి 37 రోజులు అయింది. ఈ క్రమంలో అనేక ఫొటోలు బయటకు వచ్చాయి. కానీ, ఈ ఫొటో మాత్రం చాలా చాలా ప్రత్యేకం. ఈ ఫొటో కేవలం రాజధానిపై ఆకాంక్షనే కాదు.. ఆలోచనను కూడా రేకెత్తిస్తోంది.
నిండి గర్భవతి అయిన మహిళ.. ఒక చేతిలో రాజధాని రైతుల ఆకాంక్ష..రాష్ట్ర ఆకాంక్ష అయిన.. అమరావతికి చిహ్నంగా గ్రీన్ బెలూన్ల బొకేను పట్టుకుని.. అదే చేత్తో మంచినీళ్ల బాటిల్‌ను కూడా.. పట్టుకుని.. ఇంకో చేత్తో.. చిన్నారిని తీసుకుని పాదయాత్రలో అడుగులు కదుపుతున్నారు. సాధారణంగా రాజధాని కోసం.. ఎందరో పాదం కదుపుతున్నారు. రాజధాని నినాదాన్ని పలుకుతున్నారు. పాదయాత్రకు వెళ్లలేని వారు.. మరో రూపంలో తమ మద్దతు ప్రకటిస్తు న్నారు. ఇంకొందరు మాత్రం ఏం వెళ్తాంలే.. గురూ.. అని బద్ధకిస్తున్నారు.
అయితే.. నిండు గర్భిణిగా ఉన్న ఈ మహిళ మాత్రం పాదయాత్ర రివ్వున సాగిపోతున్నా… తాను కిలో మీటర్ల దూరం వెనకబడిపోతున్నా.. మౌనంగా.. అడుగులో అడుగు వేస్తూ.. కడుపులో ఒక చిన్నారిని.. చేతిలో మరో చిన్నారిని మోస్తూ.. రాజధాని ఆకాంక్షను వెల్లడిస్తున్న తీరు అందరినీ అబ్బుర పరుస్తోంది. రాజధాని సంకల్పం.. అమరావతినే రాజధానిగా చూడాలనే సంకల్పం.. ఆమెలో నరనరానా జీర్ణించుకుపోయిన.. తీరు.. ప్రతి ఒక్కరినీ మంత్రముగ్ధులను చేస్తోంది. మరి.. ఈ ఫొటో చూసిన తర్వాత.. మనం మాత్రం జైకొట్టకుండా.. ఉండగలా.. పాదం కదపకుండా.. నిరీక్షించగలమా!!