వైసీపీ హింస‌ను కోరుకుంటోంది.. అయినా.. మేం: ప‌వ‌న్

తన విమర్శలు ఎప్పుడైనా విధానపరంగానే ఉంటాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ అన్నారు. విశాఖ గర్జన ప్రకటించిన తర్వాతే జనవాణి ప్రకటించామని అనడం సరికాదని.. వైకాపా కార్యక్రమానికి ఇబ్బంది కలిగించడం జనసేన ఉద్దేశం కాదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ తాజాగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, పార్టీ నేత నాగబాబు మీడియా సమావేశంలో పాల్గొన్నారు.

“కుల గొడవలతో ఆంధ్రప్రదేశ్‌ నిస్సారమైపోతోంది. ఒకసారి తమిళనాడు.. మరోసారి తెలంగాణ తరిమేశాయి. ఇప్పుడు అంతర్గత గొడవలతో మనమే నష్టపోతున్నాం. రాజధాని గురించి ఎవరూ ఏమీ మాట్లాడకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ ఇలా చేస్తోంది. ఇతర పార్టీలను భయపెట్టి అదుపులో ఉంచాలనేది వైసీపీ వ్యూహం. జనసేన సంస్థాగత నిర్మాణం కోసమే పర్యటనలు చేస్తున్నా. అధికారంలో ఉన్న పార్టీ గర్జించడమేంటి? వైసీపీ కోరుకుంటున్న హింసను మేం ఇవ్వలేం. మంత్రుల కార్లపై దాడి జరుగుతుంటే పోలీసులు ఏమైపోయారు?” అని ప్ర‌శ్నించారు.

“విమానాశ్రయంలో కోడి కత్తి ఘటనపై ఇప్పటికే చర్యలు లేవు. వైసీపీ శ్రేణులు ఎన్ని దాడులు చేస్తున్నా పోలీసులు ఎలాంటి కేసులు నమోదు చేయట్లేదు. వైసీపీ శ్రేణులు దాడి చేస్తే.. భావప్రకటన అని అప్పటి డీజీపీ సమర్థించారు. వైసీపీ శ్రేణులు రాళ్లు విసిరితే భావ స్వేచ్ఛ… ఇతర పార్టీలు నినాదాలు చేస్తే హ‌త్యాయ‌త్నం సెక్షన్లు వర్తిస్తాయా?” అని పవన్‌ కల్యాణ్‌ మండిపడ్డారు.

“పోలీసు వ్యవస్థ, సిబ్బందిపై నాకు కోపం లేదు. విశాఖలో నన్ను రెచ్చగొట్టి గొడవ జరిగేలా చేయాలని చూశారు. ఎంత రెచ్చగొట్టినా నేను సంయమనంతో వ్యవహరించా. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు క్రిమినల్స్‌కు సెల్యూట్‌ చేసే దారుణ వ్యవస్థ మనది. రాజకీయాల్లో క్రిమినల్స్‌ ఉండొద్దనేది నా ఆశయం. ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విశాఖ దసపల్లా భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. ఉత్తరాంధ్ర మీద ప్రేమ ఉంటే సైనికులకు చెందిన 71 ఎకరాల భూమిని ఎందుకు ఆక్రమిస్తారు? వైసీపీ నేతలు చేసే భూకబ్జాలు బయటపడతాయనే జనవాణి కార్యక్రమాన్ని అడ్డుకున్నారు” అని పవన్‌ అన్నారు.