వివేకా కేసులో కీల‌క ట్విస్ట్‌.. పోలీసులు చేతులు క‌లిపేశార‌ట‌!!

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. ఈ కేసు ఇప్ప‌టికి నాలుగేళ్లుగా సాగుతూనే ఉంది. ఈ నేప‌థ్యంలో.. ఇప్ప‌టికైనా.. కేసును ప‌రిష్క‌రించి.. త‌మ‌కు న్యాయం చేయాల‌ని బాధిత వివేకా కుటుంబం కోరుకుంటోంది. అయితే.. పొలీసులు మాత్రం పైకి ఒక‌విధంగా.. లోలోన మ‌రో విధంగా వ్య‌వహ‌రిస్తున్నార‌ని.. సీబీఐ ఆరోపిస్తోంది. ముఖ్యంగా నిందితుల‌తో పోలీసులు చేతులు క‌లిపార‌ని.. నిందితుల‌తో పోలీసులు చేతులు క‌లిపార‌ని కూడా సీబీఐ నేరుగా సుప్రీం కోర్టులోనే పేర్కొన‌డం సంచ‌ల‌నంగా మారింది.

వివేకానంద‌రెడ్డిని దారుణంగా హ‌త్య చేసిన కేసులో.. నిందితుల్లో ఒకరైన ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా సీబీఐ వాదనలు వినిపిస్తూ గంగిరెడ్డి బయట ఉంటే సాక్షుల ప్రాణాలకు ముప్పు ఉందని.. వారిని రక్షించుకోవాలంటే ఆయన బెయిల్‌ రద్దు చేయాల్సిందేనని ధర్మాసనాన్ని కోరారు. నిందితులు, స్థానిక పోలీసులు కుమ్మక్కై విచారణ జరగకుండా చూశారని సీబీఐ వాదించింది.

సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎం.ఎం.సుందరేశ్‌ ధర్మాసనం ఎర్ర గంగిరెడ్డికి నోటీసులు జారీ చేసింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. అనంతరం తదుపరి విచారణను సుప్రీంకోర్టు నవంబర్‌ 14కి వాయిదా వేసింది. ఇక‌, ఇప్ప‌టికే త‌న ప్రాణాల‌కు ముప్పు పొంచి ఉంద‌ని.. వివేకా కేసులో ఆది నుంచి అప్రూవ‌ర్‌గామారిన ద‌స్త‌గిరి త‌న ప్రాణాలకు ప్ర‌మాదం ఉంద‌ని హెచ్చ‌రిస్తున్నారు. పైగా.. ఇదే విష‌యంపై ఎస్పీకి సైతం.. ఆయన ఫిర్యాదు చేశారు. అయినా.. ఎవ‌రూ కూడా.. ఆయ‌న‌ను ప‌ట్టించుకోలేదు. ఇప్పుడు సీబీఐ నేరుగా.. గంగిరెడ్డి వంటివారిపై సీబీఐ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేసింది. ఈ నేప‌థ్యంలో మ‌రి ఇప్ప‌టికైనా.. ర‌క్ష‌ణ క‌లుతుందా.. లేదా చూడాలి.