కొత్తవారికి ఆహ్వానం పలుకుతున్న చంద్రబాబు

తెలంగాణ తెలుగుదేశం పార్టీలో తొందరలోనే కొత్త చేరికలు ఊపందుకుంటాయని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇతర పార్టీలకు చెందిన చాలామంది నేతలు టీడీపీలో చేరటానికి చాలా ఆశక్తిగా ఉన్నట్లు చెప్పారు. తెలంగాణా సీనియర్ నేతలతో జరిగిన సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ పార్టీలోకి కొత్తగా ఎవరొచ్చినా మనం చేర్చుకోవాల్సిందే అన్నారు. యువతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్లు తెలిపారు. ప్రతి కార్యకర్త కూడా మరో పదిమంది కార్యకర్తలను పార్టీలో చేర్చే కార్యక్రమాన్ని పెట్టుకోవాలని సూచించారు.

తెలంగాణాను టీడీపీ గతంలో చేసిన అభివృద్ధిని చంద్రబాబు గుర్తుచేశారు. తెలంగాణాలోని ఏమూలకు వెళ్ళినా టీడీపీ చేసిన అభివృద్ధే కనిపిస్తుందన్నారు. చేసిన అభివృద్ధిని చెప్పుకోలేకపోవటం వల్లే టీడీపీకి ఈ పరిస్దితి వచ్చిందని చంద్రబాబు బాదపడ్డారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బాగా స్పీడుచేయాలన్నారు. ఎన్టీయార్ అంటే తనకు ఎంతో గౌరవమని, ఆయనతో వచ్చిన విభేదాలను, పరిష్కారానికి చేసిన ప్రయత్నాలను తాను ఒక టీవీ షోలో వివరించినట్లు చెప్పారు.

ఎన్టీయార్ ఆశయాల ప్రకారమే టీడీపీ పనిచేస్తుందని గుర్తుచేశారు. పార్టీ బలోపేతానికి తాను తొందరలోనే పర్యటనలు చేస్తానని గతంలోనే చంద్రబాబు నేతలకు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. తొందరలోనే ఖమ్మంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు ఆమధ్య ఖమ్మం జిల్లా పర్యటనలో ప్రకటించారు. ఈమధ్య మాత్రం చంద్రబాబు తరచూ టీడీపీ నేతలతో సమావేశాలు నిర్వహిస్తున్నారు. వారంలో ఐదురోజులు తాను తెలంగాణా నేతలకు అందుబాటులో ఉంటానని ఈమధ్యనే చెప్పారు.

చంద్రబాబు మాటలు, ఆలోచనలు చూస్తుంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణాలో టీడీపీ యాక్టివ్ రోల్ పోషించాలని అనుకుంటున్నట్లుంది. అయితే అది సాధ్యమేనా అన్నదే అసలు ప్రశ్న. పార్టీనుండి చాలామంది నేతలు కాంగ్రెస్, టీడీపీ, బీజేపీల్లో చేరిపోయారు. నిజం చెప్పాలంటే తెలంగాణా నేతల్లో గట్టి నేతలు అనుకున్న వారే పెద్దగా లేరు. ఇలాంటి పరిస్ధితుల్లో పార్టీకి పూర్వవైభం అంటే చాలా కష్టపడాలి. 2023 ఎన్నికల్లో టీఆర్ఎస్ ఓడిపోతే చెప్పలేం కానీ గెలిస్తే మాత్రం పూర్వవైభవం సాధ్యంకాదనే అనుకోవాలి.