ప్రతిపక్షాలకు చోటు లేని ప్రజాస్వామ్యం అసలు ప్రజాస్వామ్యమే కాదు. ఏ ప్రతిపక్షమైనా అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని గద్దెదించి తాను అధికారంలోకి రావాలనే చూస్తుంది. ఈ దిశగానే రాజకీయం చేస్తుంది. అందుకని అసలు ప్రతిపక్షానికి అవకాశమే లేకుండా చేయాలని అడుగడుగునా అడ్డు తగిలే ప్రయత్నం చేయడం అధికార పక్షానికి తగదు. ఇలా చేస్తే భవిష్యత్తులో కథ అడ్డం తిరిగి తాము ప్రతిపక్షంలోకి వెళ్లినా ఇవే పరిస్థితులు ఎదురవుతాయి.
అసలు తమ పాలన మీద భరోసా ఉన్నపుడు ప్రతిపక్షం ఏ కార్యక్రమం చేసినా భయపడాల్సిన పని లేదు. అనవసరంగా ప్రతిపక్షానికి అడ్డు తగిలితే, ఇబ్బందులు సృష్టిస్తే అది అధికార పక్షం భయాన్ని, ఆత్మరక్షణ స్వభావాన్ని చాటి చెబుతుంది. అదే సమయంలో ప్రతిపక్షానికి ప్రజల్లో సానుభూతి పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్‌లో పరిస్థితులు ఇప్పుడు ఇలాగే ఉన్నాయి.
అసలే జగన్ సర్కారు పట్ల వ్యతిరేకత అంతకంతకూ పెరిగిపోతుండగా.. ఆ వ్యతిరేకతను ఇంకా పెంచేలా ప్రభుత్వం చర్యలు ఉంటున్నాయి. ఇటు తెలుగుదేశం, అటు జనసేన ఏ కార్యక్రమం చేపట్టినా దానికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్న జగన్ సర్కారు.. శనివారం చేసిన ఓ పనితో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. అధికార పార్టీ నేతలు వికేంద్రీకరణకు మద్దతుగా విశాఖ గర్జన ఏర్పాటు చేసిన రోజే పవన్ కళ్యాణ్ సాయంత్రం విశాఖలో అడుగు పెట్టారు. ఈ సందర్భంగా ఎయిర్ పోర్టు దగ్గర కోలాహలం నెలకొంది. ఆయన కోసం వేల మంది అభిమానులు, కార్యకర్తలు ఎదురు చూసి ఘన స్వాగతం పలికారు. రోడ్ల వెంబడి కూడా పవన్ కోసం వేలాదిగా ఎదురు చూశారు.
ఐతే పవన్ ర్యాలీ జరిగే సమయానికి రోడ్లు, వీధుల వెంబడి లైట్లు ఆపించేయడం ద్వారా ఈ షోను ఫ్లాప్ చేయాలని చూశారు. ఇది యాదృచ్ఛికంగా జరిగిందని అనుకోవడానికి ఛాన్సే లేదు. ప్లాన్ ప్రకారమే జరిగిందన్నది స్పష్టం. ఐతే జనసైనికులు ఏమాత్రం వెరవకుండా తమ సెల్ ఫోన్ల లైట్లతో పవన్ రోడ్ షోకు వెలుగునిచ్చారు. ఈ చర్య కచ్చితంగా జగన్ సర్కారు భయాన్ని చాటిచెప్పేదే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.