మూడు రోజుల పర్యటన నిమిత్తం.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. విశాఖకు చేరుకున్నారు. అయితే.. ఇదే రోజు వైసీపీ నాయకులు.. గర్జన యాత్ర చేపట్టారు. ఈ క్రమంలో అసలు పవన్ కు ఎంతమంది నుంచి ఆదరణ లబిస్తుందో చూడాలని .. వైసీపీ నాయకులు భావించారు. అయితే.. నింగి వంగిందా.. నేల ఈనిందా.. అన్న అన్నగారి డైలాగును గుర్తు చేస్తూ.. అభిమానులు పోటెత్తారు. జోరు వర్షంలోనూ.. విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. దీంతో విశాఖ జన సంద్రంగా మారిపోయింది. అయితే.. ఇదే సమయంలో విశాఖలో స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది.
విమానాశ్రయం వద్ద వైసీపీ నేతల వాహనాలపై రాళ్ల దాడి జరిగింది. విశాఖలో జనవాణి కార్యక్రమంలో పాల్గొనేందుకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ శనివారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నారు. పవన్‌కు స్వాగతం పలికేందుకు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. అదే సమయంలో విశాఖ గర్జన కార్యక్రమంలో పాల్గొని తిరిగి వెళ్లేందుకు మంత్రులు జోగి రమేశ్, రోజా, మాజీ మంత్రి పేర్ని నాని, ఉత్తరాంధ్ర వైసీపీ సమన్వయకర్త వై.వి సుబ్బారెడ్డి తదితరులు విమానాశ్రయానికి చేరుకున్నారు.
ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు కొందరు వైసీపీ నేతల వాహనాలపై రాళ్లు, చెప్పులు విసిరారు. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్తత నెలకొంది. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పరిస్థితి అదుపు చేశారు. జనవాణి కార్యక్రమంలో భాగంగా పవన్ కల్యాణ్ 3 రోజుల పాటు ఉత్తరాంధ్రలో పర్యటించనున్నారు. విశాఖ విమానాశ్రయంలో జరిగిన ఘటనపై మంత్రి అంబటి రాంబాబు ట్విటర్ ద్వారా స్పందించారు. జనసైనికుల దాడిపై పవన్ కల్యాణ్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates