బీఆర్ఎస్‌ గప్ చుప్

తెలంగాణ అధికార పార్టీ టీఆర్ ఎస్‌ను భార‌త రాష్ట్ర స‌మితి.. బీఆర్ ఎస్‌గా మారుస్తూ.. ముఖ్య‌మంత్రి.. తెలంగాణ ప్ర‌జ‌ల ఆరాధ్యుడిగా పేరొందిన కేసీఆర్ తీర్మానం చేశారు. దీనికి పెద్ద ఎత్తున హ‌డావుడి చేశారు. భారీ కాన్వాయ్‌తో.. ఆయ‌న వెళ్ల‌డం.. జిల్లాల నుంచి నాయ‌కుల‌ను కూడా రాజ‌ధానికి ర‌ప్పించడం.. వారితో సంతకాలు తీసుకోవ‌డం.. వారితోఆమోద ముద్ర వేయించుకుని.. టీఆర్ ఎస్ పార్టీని.. ఇక‌ నుంచి జాతీయ పార్టీగా గుర్తించాల‌ని.. తీర్మానం చేశారు. ఆత‌ర్వాత‌.. ఎన్నిక‌ల సంఘానికి పంపించారు.

ఇంత వ‌ర‌కు బాగానే ఉంది. అయితే.. రాష్ట్రంలో ఏం జ‌రిగినా.. త‌న‌కు ప్ల‌స్ అవుతుంద‌ని అనుకుంటే.. వెంట‌నే రియాక్ట్ అయ్యే సీఎం.. విష‌యం ఏదైనా.. ప్ర‌జ‌ల‌తో పంచుకునే కేసీఆర్.. బీఆర్ఎస్ తీర్మానం త‌ర్వాత‌.. అస‌లు ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ కాక‌పోవ‌డ‌మే ఇప్పుడు చ‌ర్చ‌కు దారితీస్తోంది. వాస్త‌వానికి బీఆర్ఎస్ ఏర్పాటుకు ముందే.. దేశ‌వ్యాప్తంగా త‌న అనుకూల నేత‌ల‌తో సంప్ర‌దింపులు జ‌రిపేందుకు సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేశారు. ప్ర‌త్యేకంగా విమానం కొంటున్న‌ట్టు పార్టీ నేత‌ల‌తో మీడియాకు చెప్పించారు.

మ‌రి జాతీయ పార్టీపై ఇంత హ‌డావుడి చేసిన కేసీఆర్‌.. త‌న నోటి వెంట ఒక్క మాట కూడా.. తెలంగాణ స‌మాజానికి బీఆర్ ఎస్ పుట్టుక‌.. ల‌క్ష్యాలు.. భ‌విష్య‌త్తులో వేయ‌బోయే అడుగులు వంటివి వివ‌రిస్తార‌ని.. అంద‌రూ ఆకాంక్షించారు. కానీ, ఇప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న అస‌లు దీనిపై మీడియాతో మాట మాత్రం కూడా సంప్ర‌దించ‌లేదు. అంతేకాదు.. లోక‌ల్ మీడియాలోనూ.. జాతీయ‌స్థాయి మీడియాలోనూ.. దీనిపై ఎలాంటి ప్ర‌క‌ట‌న లేకుండానే.. ఢిల్లీలో ప‌ర్య‌టించ‌డం.. ఆస‌క్తిగా మారింది.

అంటే.. బీఆర్ఎస్ ప్ర‌క‌ట‌న విష‌యంలో ఇంకా త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నారా? లేక‌.. భారీగా ఒక స‌భ ఏర్పాటు చేసి.. త‌న‌కు అనుకూలంగా ఉన్న‌వార‌ని పిలిచి.. వారి స‌మ‌క్షంలో తెలంగాణ స‌మాజానికి చెప్పాల‌ని .. భావిస్తున్నారా? అనేది రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఎన్నిక‌ల‌కు కేవ‌లం ఏడాదిన్న‌ర స‌మ‌యమే ఉండ‌డం.. ఈ లోగానే పార్టీని.. దేశ‌వ్యాప్తంగా విస్త‌రించ‌డం.. అనే కీల‌క ప‌రిణామాలు ఉన్న నేప‌థ్యంలో ఇప్ప‌టి వ‌ర‌కు కేసీఆర్ స్పందించ‌క పోవ‌డం.. చ‌ర్చ‌గా మారింది. మ‌రి ఎప్పుడు రియాక్ట్ అవుతారో చూడాలి.