బీజేపీ చీలిపోతోందా..వైసీపీ చీల్చుతోందా?

ఏపీ బీజేపీ ఇప్పుడు రాజ‌కీయాల్లో హాట్ టాపిక్‌గా మారుతోంది. ఆ పార్టీలోని అంత‌ర్గ‌త ప‌రిణామాల‌పై రాజ‌కీయ విశ్లేష‌కులు ఘాటుగా స్పందిస్తున్నారు. ఏకంగా వైసీపీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి స‌న్నిహితుడ‌నే పేరున్న ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

ఏపీ బీజేపీ సీనియ‌ర్ నేత సోము వీర్రాజు స్పంద‌న ఓ ర‌కంగా ఉంటే మ‌రోవైపు ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ తీరు భిన్నంగా ఉంద‌ని ప్ర‌స్తావించారు. త‌ద్వారా సీనియ‌ర్ నేత‌లు, పార్టీలోని మ‌రో వ‌ర్గానికి చెందిన నేత‌ల మ‌ధ్య గ్యాప్ ఏర్ప‌డిందా? అనే చ‌ర్చ తెర‌మీద‌కు వ‌స్తోంది.

ఏంటి కన్నా! తమరు మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు. లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖాస్త్రాలు సంధిస్తారు. టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేం అలర్ట్ చేస్తే తప్పా..? బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబళించే పనిలో ఉన్న..ఆ పసుపు మిడతల దండులో మీరూ భాగస్వామేనా.? అంటూ ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ‌ను నేరుగా ట్విట్ట‌ర్లో విజ‌య‌సాయిరెడ్డి టార్గెట్ చేశారు.

అదే స‌మ‌యంలో నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చ పార్టీ ఆందోళనకు దిగడంపై బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హర్ట్ అవుతాడో అని కన్నా సైలెంటయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి ‘విజనరీ’ చీకటి మిత్రులకూ టెన్షన్ పట్టుకుంది. అంటూ క‌న్నా తీరు బీజేపీలోని సీనియ‌ర్ నేత‌ల మ‌ధ్య గ్యాప్ ఉంద‌నే అనుమానాన్ని రేకెత్తించారు.

బీజేపీ ఏపీ అధ్య‌క్షుడిని టార్గెట్ చేయ‌డం ద్వారా ఏపీ బీజేపీలోని నేత‌ల్లో చీలిక తేవాల‌ని విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌ణాళికలు ర‌చిస్తున్నారా అనే సందేహం ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు. బీజేపీలోని సీనియ‌ర్ నేత‌ల దూకుడుకు, క‌న్నా శైలికి సంబందం లేద‌నే విష‌యాన్ని ఎత్తి చూపేందుకే విజ‌య‌సాయిరెడ్డి ప్ర‌య‌త్నిస్తున్నారా అనే ప్ర‌శ్న‌లు తెర‌మీద‌కు వ‌స్తున్నాయి. అయితే, త‌మ అధ్య‌క్షుడిది పొర‌పాటేమీ లేద‌ని, వైసీపీ ఉద్దేశ‌పూర్వ‌కంగానే విమ‌ర్శ‌లు చేస్తోంద‌ని బీజేపీ నేత‌లు ఇప్ప‌టికే క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.