గూగుల్ మ్యాప్‌లు అబ‌ద్ధాలు చెబుతాయా?: హైకోర్టు ఫైర్‌

విశాఖపట్నంలోని రుషికొండ తవ్వకాల అంశంపై ఏపీ హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు చేసింది. అభివృద్ధి పేరిట కొండలను తొలిచేస్తున్నారని వ్యాఖ్యానించింది. రుషికొండ తవ్వకాలపై దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్‌ ప్రశాంత్ కుమార్ మిశ్రా ధర్మాసనం విచారణ చేపట్టింది. ప్రభుత్వం వైపు నుంచి ఏదో దాస్తున్నట్టు కనిపిస్తోందని బెంచ్‌ అభిప్రాయపడింది. కేంద్ర అటవీశాఖ ఆధ్వర్యంలో రుషికొండ తనిఖీ చేయాలని పంపుతామని.. కమిటీ వేస్తే మీరెందుకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

విచారణ సందర్భంగా పిటిషనర్ తరపున న్యాయవాదులు.. 9.88 ఎకరాలకు అనుమతిస్తే 20 ఎకరాల్లో తవ్వకాలు చేశారని చెప్పారు. గూగుల్ మ్యాప్‌లను అందించారు. అయితే ఈ వాదనలను ప్రభుత్వ తరఫు న్యాయవాది నిరంజన్ రెడ్డి ఖండించారు. ప్రభుత్వం 9.88 ఎకరాలకే పరిమితమయిందని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రశాంత్ కుమార్ మిశ్రా.. గూగుల్ మ్యాప్ లు అబద్దాలు చెబుతాయా? అని ప్రశ్నించారు.

ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించి అఫిడవిట్ దాఖలు చేస్తామని.. అప్పటివరకు సమయం ఇవ్వాలని న్యాయస్థానాన్ని కోరారు. ఈ సందర్భంగా ప్రభుత్వం ఏదో దాస్తున్నట్టుగా ఉందని సందేహం వ్యక్తం చేసిన ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం.. ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసిన తర్వాత నిజా, నిజాలు తెలుస్తాయని వ్యాఖ్యానించింది. తదుపరి విచారణను నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది.

టీడీపీ నేత వెలగపూడి రామకృష్ణ, మరొకరు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ జరుపుతుత‌న్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల రుషికొండ‌పై న్యాయవాదులు పరిశీలనకు అడ్డుకున్నారు. ఈ నేప‌థ్యంలోనే కోర్టు తాజాగా ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం.