వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్ బ్రాండ్, మాజీ మంత్రి కొడాలి నాని తన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారానికి తెర దీశారు. టీడీపీ నేతలపై నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ 33వ వార్డులో గడపగడప మన ప్రభుత్వం రెండవ రోజు కార్యక్రమంలో కొడాలి నాని పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… అస్తమించిన వ్యవస్థ టీడీపీ అని… ఆ పార్టీ డిఫాల్డర్లు నోటికొచ్చినట్లు వాగుతున్నారని మండిపడ్డారు. టీడీపీ పని అయిపోయిందని.. ఇక తట్టా బుట్టా సర్దు కోవడమే మేలని అన్నారు.
లోకేష్ కు పార్టీ అప్పచెప్పడానికి పాదయాత్రలో జూనియర్ ఎన్టీఆర్ ను తిట్టిస్తున్నారని నాని అన్నారు. అమరావతిలో టీడీపీ వాళ్ళు చేసిన రియల్ ఎస్టేట్ మాఫియా, విశాఖలో కూడా జరుగుతునట్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. 29 గ్రామాల అమరావతి ఎక్కడ, 25 లక్షల జనాభా గల విశాఖ ఎక్కడ అని అన్నారు. విశాఖ నగరంపై టీడీపీ రియల్ ఎస్టేట్ బ్రోకర్లు విషం కక్కుతున్నారని ఆయన దుయ్యబట్టారు.
30 లక్షలు ఉన్న అమరావతి భూములు రూ.10 కోట్లకు పెరిగాయన్నారు. రాజధాని నిర్ణయం తర్వాత గజాలు లెక్కన విక్రయాలు జరిగే విశాఖ భూముల ధరల్లో ఏం మార్పు వచ్చిందని ప్రశ్నించారు. విశాఖ దసపల్లా భూముల్లో టిడిపి ఆఫీసు, చంద్రబాబు అనుయాయుల కార్యాలయాలు ఉన్నాయన్నారు. విజయసాయి రెడ్డి ఎలా కబ్జా చేస్తారని నిలదీశారు. ప్రభుత్వ ఆస్తి అయిన రిషికొండలో ప్రభుత్వ కార్యాలయాలు కడుతుంటే దోపిడీ ఎలా అవుతుందని అన్నారు. ఒక అబద్ధాన్ని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారంటూ కొడాలి నాని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఇలాంటి విమర్శలను ప్రజలు నమ్మరని అన్నారు. “పవన్ పకోడీ మాటలను చకోడీ వంటి చంద్రబాబు నమ్మాలి.. లేదా.. ఆయన వందిమాగధులు నమ్మాలి. ప్రజలు నమ్మరు. గత ఎన్నికల్లో పకోడీ పవన్‌కు రెండు చెంపలు వాయించారు. చకోడీ బాబును ఎగ్గిరి ఒక తన్ను తన్నారు.. అయినా.. బుద్ది రాలేదు“ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై టీడీపీ నాయకులు తీవ్రస్తాయిలో మండి పడుతున్నారు.