ఢిల్లీ లిక్కర్ స్యామ్ లో సీబీఐ, ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మంచి దూకుడు మీద ఉంది. స్కాం జరిగింది ఢిల్లీలోనే అయినా దాని మూలాలు హైదరాబాద్ లోనే ఉన్నాయంటు పదేపదే పై రెండు దర్యాప్తుసంస్ధలు దాడులు, సోదాలతో హడలెత్తిస్తున్నాయి. తాజాగా అభిషేక్ రావును అరెస్టు చేయటంతో అధికారపార్టీలో సంచలనంగా మారింది. అభిషేక్ అరెస్టుతో దర్యాప్తు సంస్ధలకు అనేక వివరాలు అందే అవకాశముందట.
తాజాగా అరెస్టయిన అభిషేక్ ఇచ్చే వివరాల ప్రకారం తర్వాత టార్గెట్ ఎంఎల్సీ, కేసీయార్ కూతురు కవితే అనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇప్పటికే అరెస్టయిన రామచంద్రపిళ్ళై అప్రూవర్ గా మారిపోతానని దర్యాప్తు సంస్ధలకు చెబుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. పిళ్ళై గనుక అప్రూవర్ గా మారిపోతే బీఆర్ఎస్ లోని చాలామంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చే అవకాశాలున్నాయని అనుకుంటున్నారు. ఇప్పటికే స్కాం సూత్రదారి కవితే అంటు ఢిల్లీలో బీజేపీ నేతలు పదే పదే ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.
అభిషేక్ కు కవితతో సంబంధం ఏమింటటే గతంలో ఈయన కవిత దగ్గర చాలాకాలం పీఏగా పనిచేశారు. కాబట్టి కవిత గుట్టుమట్లన్నింటినీ ఈయనకు కచ్చితంగా తెలిసుంటాయన్నది అందరి అనుమానం. ఇప్పటివరకు దర్యాప్తు సంస్ధల టార్గెట్ అంటు ఎవరి పేర్లను ప్రకటించలేదు. అయితే హైదరాబాద్ పైనే ఎక్కువ దృష్టిని కేంద్రీకరించటం, తరచూ దాడులు చేస్తుండటంతో రాజకీయంగా అందరిలోను అనేక అనుమానాలు పెరిగిపోతున్నాయి.
మొత్తానికి టీఆర్ఎస్ లోని ప్రముఖులే టార్గెట్ గా దర్యాప్తుసంస్దలు దాడులు, సోదాలు జరుపుతున్నాయనే ప్రచారం బాగా పెరిగిపోతోంది. ఇదే సమయంలో అరెస్టయిన ఇద్దరు ఇచ్చే సమాచారం ఆధారంగానే తదుపతి అరెస్టులు ఉంటాయని అర్ధమవుతోంది. మరి ఇప్పటికే అరెస్టయిన పిళ్ళై, అభిషేక్ విచారణలో ఎలాంటి వివరాలు చెబుతారనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వంలో కొందరు ప్రముఖులను దర్యాప్తు సంస్ధలు విచారించిన విషయం తెలిసిందే. కాబట్టి నెక్స్ట్ టార్గెట్ బీఆర్ఎస్సే అంటున్నారు.