తెలుగు రాష్ట్రాల్లో అసెంబ్లీ స్థానాలు పెంపు?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ.. అసెంబ్లీ స్థానాల‌ను పెంచుతూ.. నిర్దేశించే ఫైలపై క‌ద‌లిక వ‌చ్చిందా? ఒక వైపు.. జ‌మ్ము క‌శ్మీర్‌లో అసెంబ్లీ స్థానాలు పెంచుతూ..కేంద్రం నిర్ణ‌యం తీసుకోవ‌డం.. మ‌రోవైపు.. ఏపీ, తెలంగాణ‌పై వివ‌క్ష చూపించ‌డంపై సుప్రీం కోర్టులో పిటిష‌న్ దాఖ‌లైన ద‌రిమిలా.. కేంద్రం వ్యూహాత్మకం గా ఈ ఫైలుపై దృష్టి సారించిందా? అంటే.. ఔననే అంటున్నాయి ఢిల్లీ వ‌ర్గాలు. ప్ర‌స్తుతం ఈ కేసు విచార‌ణ మ‌ళ్లీ మొద‌లు కానుంది. ఈ వారంలోనే దీనిపై సుప్రీం కోర్టు విచార‌ణ చేప‌ట్ట‌నుంది.

ఈ నేప‌థ్యంలో కేంద్ర హోం శాఖ రెండు తెలుగు రాష్ట్రాల్లోని అసెంబ్లీ స్థానాల పెంపుపై నిర్ణ‌యం తీసుకునేందుకు రెడీ అయిందనే స‌మాచారం అందుతోంది. రాష్ట్ర పున‌ర్‌విభ‌జ‌న చ‌ట్టం షెడ్యూల్ 10లో పేర్కొన్న విధంగా రెండు రాష్ట్రాల్లోనూ అసెంబ్లీ స్థానాలు పెరిగితే.. ఏపీలో ఇప్పుడున్న 175 స్థానాలు 225కు పెరుగుతాయి. అంటే. ఏకంగా 50 స్థానాలు పెరిగే ఛాన్స్ ఉంది. ఇక‌, తెలంగాణ‌లో ఇప్పుడున్న 119 స్థానాలు 153 స్థానాల‌కు చేరుకుంటుంది. అంటే.. ఏకంగా.. 34 స్థానాలు పెరుగుతాయి.

ఇప్పుడు ఈ రెండు రాష్ట్రాల్లోనూ అధికారంలో ఉన్న టీఆర్ఎస్‌, వైసీపీల‌కు ఇదే కావాలి. ఎందుకంటే.. సీట్లు పెరిగితే.. అసంతృప్తులను త‌గ్గించ‌వ‌చ్చ‌ని.. ఆశావ‌హులు అంద‌రికీ.. కూడా.. సీట్లు కేటాయించే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే రెండు రాష్ట్రాలూ.. కూడా.. ఈ విష‌యంలో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుంటున్నాయ‌ని తెలుస్తోంది. ఎందుకంటే.. సీట్ల పెంపు విష‌యంలో.. ఈ రెండు పార్టీల‌కు వ‌చ్చే న‌ష్టం ఏమీ లేక‌పోగా.. లాభం ఉంది.

సీట్లు పెరిగితే.. ప్ర‌తిప‌క్ష‌ల‌కు అభ్య‌ర్థులు లేకుండా పోతార‌ని.. త‌ద్వారా.. తాము లాభ ప‌డొచ్చ‌ని..అధికార పార్టీల ఎత్తుగ‌డ‌గా ఉంది.దీనికి తోడు.. ఈ విష‌యంలో మంకు ప‌ట్టుప‌ట్టిన‌.. కేంద్రంపై పైచేయి సాధించేందుకు కూడా అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. అందుకే.. టీఆర్ఎస్‌, వైసీపీ ఎంపీలు.. ఈ విష‌యంలో ప‌ర‌స్ప‌రం స‌హ‌క‌రించుకుని.. సుప్రీం కోర్టులో వాద‌న‌లు సైతం వినిపించేందుకు రెడీ అయిన‌ట్టు ఢిల్లీ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇత‌ర విష‌యాలు ఎలా ఉన్నా.. ఇది రాజ‌కీయంగా త‌మ‌కు ల‌బ్ధి చేకూరుస్తుంద‌ని ఈ రెండు పార్టీలు కూడా భావిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి చివ‌ర‌కు కేంద్రం ఏం చేస్తుందో చూడాలి.