బీజేపీలోకి రాయ‌పాటి?

ఒకింత ఆశ్చ‌ర్యంగా ఉన్నా.. ఇది నిజ‌మే! గుంటూరుకు చెందిన మాజీ ఎంపీ.. టీడీపీ సీనియ‌ర్ నేత‌.. రాయపాటి సాంబ‌శివ‌రావు త్వ‌ర‌లోనే .. బీజేపీ తీర్థం పుచ్చుకుంటున్నార‌నే వార్త క‌మ‌ల‌ద‌ళంలో భారీ ఎత్తున హ‌ల్చ‌ల్ చేస్తోంది. పార్టీ సీనియ‌ర్ కావ‌డం.. మంచి ప‌లుకుబ‌డి ఉండడం.. ఆర్థికంగా కూడా బ‌లంగా ఉండడంతో ఇలాంటి వారికోస‌మే.. బీజేపీ ఎదురు చూస్తోంది. ఆయ‌న గెలిచి.. మ‌రో ఇద్ద‌రిని గెలిపించ‌గ‌లిగితే.. చాలు.. అనే ధోర‌ణిలో బీజేపీ నేత‌లు ఉన్నార‌ని తెలుస్తోంది.

ప్ర‌స్తుతం రాయ‌పాటి టీడీపీలోనే ఉన్నారు..కానీ, ఆయ‌న‌ను టీడీపీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని.. ఆయ‌న వ‌ర్గం చెబుతోంది. ఎందుకంటే.. మ‌హానాడుకు దూరంగా ఉన్నారు. ఆయన కుమారుడు రంగారావుకు.. స‌త్తెన‌పల్లి టికెట్ కోరుతున్నారు. త‌న‌కు న‌ర‌సారావుపేట ఎంపీ టికెట్ అడుగుతున్నారు అయితే.. రాయ‌పాటి కుటుంబానికి ఏదో ఒక‌టే ఇస్తామ‌ని..నిన్న మొన్న‌టి వ‌ర‌కు కూడా.. టీడీపీ నేతలు చెప్పుకొచ్చారు. అయితే.. ఇప్ప‌డు ఏదీ ఇచ్చేది లేద‌ని..అంటున్నార‌ని.. రాయ‌పాటి వ‌ర్గంలో గుస‌గుస వినిపిస్తోంది.

ఇటీవ‌ల రాయ‌పాటి.. టీడీపీపై జోస్యం చెప్పారు. ఇప్ప‌టికిప్పుడు ఎన్నిక‌లు జ‌రిగితే.. టీడీపీ 125 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకుంటుంద‌ని అన్నారు. అంతేకాదు.. ఒంట‌రిగా పోటీ చేసినా.. ఇదే ఫ‌లితం వ‌స్తుంద‌ని అన్నారు. అయితే.. దీనిపై టీడీపీ నేత‌లు ఒక్క‌రంటే.. ఒక్క‌రు కూడా స్పందించ‌లేదు. దీంతో మాన‌సికంగా.. ఒకింత ఇబ్బంది ప‌డిన రాయ‌పాటి.. టీడీపీ అనుకూల మీడియా కూడా.. త‌న‌ను దూరం పెట్టింద‌ని.. వాపోయారు. ట్వీట్ట‌ర్ వేదిక‌గా.. ఆయ‌న‌ త‌న ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు.

ఈ క్ర‌మంలో బీజేపీ చీఫ్ సోము వీర్రాజు అనుచ‌రుడు.. గుంటూరుకు చెందిన ఒక నేత‌తో రాయ‌పాటి సంభాషించార‌ని.. త‌న‌కు అభ్యంత‌రం లేదని.. అయితే.. త‌న కుటుంబానికి రెండు టికెట్లు కావాల‌ని.. ఆయ‌న కోరిన‌ట్టు గుంటూరులో వార్త‌లు హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం దీనిపై క‌స‌ర‌త్తు న‌డుస్తోంద‌ని.. సంక్రాంతి నాటికి.. ఏదో ఒక నిర్ణ‌యం తీసుకుని.. బీజేపీ ప్ర‌క‌టించే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు. మ‌రి ఇంత జ‌రుగుతున్నా టీడీపీ సైలెంట్ కావ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రాయ‌పాటిని వ‌దులుకునేందుకు టీడీపీ రెడీగానే ఉందా? అనే అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.