ఏపీలో సెంటిమెంట్ పిండే ఐడియా వేసిన బీజేపీ

బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ చీఫ్ కేసీయార్ ను విచిత్రమైన డిమాండ్ చేశారు. ఏపీలోకి అడుగుపెట్టేముందే కేసీయార్ క్షమాపణలు చెప్పాలట. ఆంధ్రప్రదేశ్ కు తీరని ద్రోహం చేసిన కేసీయార్ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వద్దామని అనుకుంటున్నారంటు నిలదీశారు. గతంలో తెలుగుతల్లి విగ్రహానికి చెప్పులదండ వేసి కాళ్ళు, చేతులు తొలగించిన వ్యక్తి కేసీయార్ అంటు మండిపడ్డారు.

సరే రాష్ట్ర విభజన సందర్భంగా కానీ ఆ తర్వాత కానీ ఏపీ జనాలను ఉద్దేశించి కేసీయార్ చాలా అవమానకరంగా మాట్లాడిందైతే వాస్తవమే. బీఆర్ఎస్ ఏర్పాటుతో ఏపీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాలని అనుకుంటున్న కేసీయార్ కు ఓట్లేయాలా వద్దా అనేది జనాలు చూసుకుంటారు. అయితే.. కేసీఆర్ ఆధారంగా ఏపీలో తెలుగు తల్లి సెంటిమెంట్ ను పండించడానికి బీజేపీ ప్రయత్నిస్తోంది.

ఏపీకి కేసీయార్ చేసిన ద్రోహం సంగతి సరే మరి బీజేపీ చేసిన ద్రోహం మాటేమిటి ? 2014 ఎన్నికల్లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ఏపీకి ఎంత అన్యాయం చేస్తోందో అందరికీ తెలుసు. విభజనచట్టం అమలును నరేంద్రమోడీ సర్కార్ తుంగలో తొక్కేసింది. ప్రత్యేకహోదాపై దెబ్బకొట్టింది. విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేకరైల్వేజోన్ అంశాన్ని గాలికొదిలేసింది. వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి నిదులను ఆపేసింది. పోలవరం ప్రాజెక్టుకు అవసరమైన నిధులు విడుదల చేయకుండా బాగా ఇబ్బంది పెడుతోంది. చివరకు విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కూడా ప్రైవేటీకరణ చేసేస్తోంది. కాబట్టి బీజేపీ వాళ్లు ఏపీకి సారీ చెప్పాలి కదా.

కమలనాథులు ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పారు. సో మొత్తం మీద అర్ధమవుతున్నదేమంటే ఏపీని కేసీయార్ ఒకరకంగా దెబ్బకొడుతుంటే, నరేంద్రమోడీ సర్కార్ మరోరకంగా దెబ్బకొడుతోంది. మోడీ, కేంద్రమంత్రులు ఏమొహాలతో ఏపీలోకి అడుగుపెడుతున్నారో కేసీయార్ కూడా అదే మొహంతో అడుగుపెడతారు.