బీఆర్ఎస్‌పై వైసీపీ స్టాండ్ ఎలా ఉందంటే…!

బీఆర్ఎస్‌.. భార‌త రాష్ట్ర స‌మితి .. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ స్థాపించిన జాతీయ పార్టీ. దేశ‌వ్యాప్తంగా.. దీనిపై చ‌ర్చ జ‌రుగుతున్న‌దా.. లేదా.. అనే విష‌యాన్ని ప‌క్క‌న పెడితే.. మ‌న తెలుగు వాడు.. పెట్టిన పార్టీ కాబ‌ట్టి.. తెలుగు వారిగా.. ఒకింత గ‌ర్వించ‌ద‌గ్గ విష‌య‌మే అవుతుంది. ఎందుకంటే.. ప్రాంతీయ పార్టీల‌ను జాతీయ పార్టీగా మార్చ‌డంలో ఇప్ప‌టికే టీడీపీ లైన్‌లో ఉంది. టీడీపీ జాతీయ పార్టీగా ఎన్నిక‌ల సంఘంలో గుర్తింపు పొందింది.

అయితే.. ఇత‌ర రాష్ట్రాల్లో ఇప్ప‌టి వ‌ర‌కు పోటీ చేయ‌లేదు. స‌రే.. ఇప్పుడు.. కేసీఆర్‌. జాతీయ స్థాయిలో వెలుగుతానంటూ.. దూకుడుగా ముందుకు వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఏపీ విష‌యాన్ని తీసుకుంటే.. ముఖ్యంగా అధికార పార్టీ వైసీపీ ప‌రిస్థితి ఏంటి? అనేది ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న విష‌యం. ఎందుకంటే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ పోటీ చేయాల‌నే వ్యూహంతో కేసీఆర్ ఉన్నార‌నే.. చ‌ర్చ కొన్నాళ్లుగా జ‌రుగుతోంది. ఈ విష‌యంపై.. అనేక సందేహాలు ఉన్నా.. ఇప్పుడు క్లారిటీ వ‌చ్చేసింది.

పొరుగు రాష్ట్రం.. పైగా తెలుగు రాష్ట్రం.. అంతా మ‌నోళ్లే.. పైగా హైద‌రాబాద్‌లో వ్యాపారాలు చేసుకునేవారు కూడా ఉన్నారు. ఈ క్ర‌మంలో కేసీఆర్‌కు ఏపీపై దృష్టి పెట్ట‌డం ఖాయం. విశాఖ స‌హా.. క‌ర్నూలు.. వంటి ఉమ్మ‌డి జిల్లాల్లో 4-5 జిల్లాల‌ను ఎంపిక చేసుకుని ఆయ‌న పోటీకి దిగ‌డం ఖాయ‌మ‌నే వాద‌న వినిపిస్తోంది. దీంతో ఈ విష‌యంపై అధికార వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుంద‌నేది ప్ర‌శ్న‌. ఇప్ప‌టికే టీడీపీ తిప్పి కొట్టింది. పార్టీకి, కేసీఆర్‌కు నిజాయితీలేద‌ని వ్యాఖ్యానించింది.

మ‌రి వైసీపీ ఏమ‌ని భావిస్తుంది? అనేది ప్ర‌శ్న. ఈ విష‌యంలో మంత్రులు కొంద‌రు మాట్టాడుతూ.. కేసీఆర్ రావొచ్చ‌ని.. స‌భ‌లు కూడా పెట్టొచ్చ‌ని.. త‌ప్పేముంద‌ని వ్యాఖ్యానించారు. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల‌ను చూసుకుంటే.. వైసీపీ వ్య‌తిరేక ఓటు బ్యాంకు పెరుగుతుంద‌నే అంచ‌నా వుంది. ఈ క్ర‌మంలో దీనిని చీల‌కుండా.. చూస్తాన‌ని జ‌న‌సేనాని ప‌వ‌న్ వ్యాఖ్యానించారు. కానీ, ఇది చీలితేనే బెట‌ర్ అని వైసీపీ భావిస్తోంది. ఇది చీలాలంటే.. కేసీఆర్ జాతీయ పార్టీ పేరుతో ఇక్కడ పోటీకి దిగితేనే బెట‌ర్‌. సో.. ఈ కోణంలో చూసుకుంటే.. కేసీఆర్ విష‌యంలో వైసీపీ సానుకూల ధోర‌ణితోనే ఉన్న‌ట్టు క‌నిపిస్తోంది.