మునుగోడులో కాంగ్రెస్ తాజా వ్యూహం

నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మునుగోడు ఉపఎన్నికలో పార్టీల స్పీడు పెరిగింది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి పాల్వాయి స్రవంతి, బీజేపీ అభ్యర్ధి కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి ప్రచారంలో బిజీగా ఉన్నారు. టీఆర్ఎస్ (బీఆర్ఎస్) అభ్యర్ధిని ప్రకటించటంలో కేసీయార్ వెనకాముందు ఆడుతున్నారు. ఈ నేపధ్యంలోనే కాంగ్రెస్ నేతలు సీరియస్ గా రంగంలోకి దిగిపోయారట. ఒకపుడు ఇదే నియోజకవర్గంలో కాంగ్రెస్ ఐదుసార్లు గెలిచింది. కానీ అదంతా చరిత్రగా మిగిలిపోయింది.

సరే ఇప్పటి పరిస్దితి ఏమిటంటే గెలవాలనే పట్టుదల ఒకవైపు, ఓడిపోతామేమో అనే టెన్షన్ మరోవైపు హస్తంపార్టీ నేతల్లో టెన్షన్ పెంచేస్తోందట. అందుకనే కచ్చితంగా గెలవాల్సిందే అన్న పద్దతిలో ఈమధ్యే పరిస్దితిని సమీక్షించారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. అయితే రివ్యూలో కొన్ని లోపాలు కనిపించాయట. బూత్ లెవల్ కమిటీల ద్వారా ప్రచారం చేస్తే పెద్దగా ఉపయోగం ఉండదని నిర్ధారణకు వచ్చారట. అందుకనే రూటు మార్చేశారు.

ఇంతకీ ఆ కొత్త రూటు ఏమిటంటే బూత్ లెవల్ ప్రచారం కాకుండా ప్రతి ఓటరును వ్యక్తిగతంగా టచ్ చేయాలని డిసైడ్ చేశారట. ప్రతి 50 మంది ఓటర్లకు ఒక ఇన్చార్జిని నియమించబోతున్నారట. 50 మంది ఓటర్లను ఒకటికి మూడుసార్లు టచ్ చేయాల్సిన ఇన్చార్జిలను తొందరలోనే ఫైనల్ చేయబోతున్నారు. దీనికి సంబందించిన బ్లూ ప్రింట్ పై గాంధీభవన్లో కసరత్తు జరుగుతోంది. ఇందులో కూడా ఆర్ధికంగా గట్టిగా ఉన్న నేతలనే ఇన్చార్జిలుగా నియమించాలన్నది కీలకమైన నిర్ణయమట.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే అభ్యర్ధిగా స్రవంతి పెద్ద గట్టి అభ్యర్దేమీ కాదు. ఎప్పుడో తన తండ్రి పాల్వాయి గోవర్ధనరెడ్డి ఐదుసార్లు గెలిచారు. ఆయన చనిపోయి కూడా చాలా కాలమైంది. కాబట్టి ఇప్పటి ఓటర్లకు గోవర్ధనరెడ్డి పేరు చెబితే పెద్దగా కనెక్టవ్వరు. ఇపుడు స్రవంతి గెలవటమన్నది అభ్యర్ధికన్నా రేవంత్ రెడ్డికే పెద్ద ప్రిస్టేజి అయిపోయింది. అందుకనే పార్టీ గెలుపుకోసం నానా అవస్తలు పడుతున్నారు.