వచ్చే ఎన్నికల్లో 15-20 దాకా ఎంపీస్థానాలను దక్కించుకోవాలని.. టీడీపీ ప్లాన్ చేసుకుంది. దీనికి తగ్గట్టుగానే .. అడుగులు వేయాలని నిర్ణయించుకుంది. అయితే.. అనుకున్న విధంగా మాత్రం పరిస్తితి కనిపించడం లేదట. టీడీపీ అధినేత చంద్రబాబు ఎమ్మెల్యే టికెట్లపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దీంతో పార్లమెంటు స్థానాలపైనా.. దృష్టి పెట్టాలని.. నాయకులు కోరుతున్నారు. ముఖ్యంగా చాలా నియోజకవర్గాల్లో పార్టీకి అభ్యర్థుల కొరత వెంటాడుతోంది. ఈ జాబితా తలుచుకుంటేనే బాధేస్తోందని.. సీనియర్లు అంటున్నారు.
మరి అంతగా టీడీపీకి వచ్చిన ఇబ్బందేంటి? అనేది ఇప్పుడు ప్రశ్న. విషయంలోకి వెళ్తే.. రాష్ట్రంలో పాతిక నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. దాదాపు పది నియోజకవర్గాల్లో టీడీపీకి అభ్యర్థులు లేరు. ఈ జాబితాలో.. చిత్తూరు, తిరుపతి, నరసారావు పేట, బాపట్ల, మచిలీపట్నం(కొనకళ్లకు ఇష్టం లేదు), అనంతపురం, కర్నూలు, కడప, రాజమండ్రి, కాకినాడ నియోజకవర్గాల్లో అసలు అభ్యర్థులే లేకపోవడం.. పార్టీని కలవరపరుస్తొంది. గత ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో పోటీ చేసిన వారు.. ఇప్పుడు యాక్టివ్‌గా లేకపోవడం.. చంద్రబాబు ఎన్నిసార్లు చెప్పినా.. యాక్టివ్ కాకపోవడం.. వంటివి ఈ నియోజకవర్గాల్లో పార్టీని ఇరకాటంలో పడేస్తున్నాయి.
దీంతో ఈ నియోజకవర్గాల్లో పరిస్తితి ఏంటనేది ఇప్పటికీ ప్రశ్నార్థకంగానే మారింది. అనంతపురం నుంచి గత ఎన్నికల్లో జేసీ పవన్ పోటీ చేశారు. ఈయన యువకుడే అయినా.. నియోజకవర్గంలో ఉండడం లేదు. ఉన్నా.. పార్టీ నేతలతో కలివిడిగా ఉండడం లేదు. ఇక, కర్నూలులో గత ఎన్నికల్లో కోట సూర్యప్రకాశ్ రెడ్డి పోటీ చేశారు. వయసు రీత్యా ఆయనను తప్పిస్తే.. ఇక్కడ ఎవరికి ఇస్తారనేది ప్రశ్న. కడపలో గత ఎన్నికల్లో ఆదినారాయణరెడ్డి పోటీ చేశారు. అయితే..ఆయన ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. అదేవిధంగా రాజమండ్రి నుంచి గత ఎన్నికల్లో మాగంటి రూపాదేవి పోటీ చేశారు. తర్వాత.. ఇనాక్టివ్ అయ్యారు.
కాకినాడ నుంచి చలమలశెట్టి సునీల్ పోటీ చేశారు, తర్వాత వైసీపీలోకి వచ్చారు. దీంతో ఇక్కడా టీడీపీ జెండా మోసే నాయకుడు లేరు. చిత్తూరులో గత ఎన్నికల్లో శివప్రసాద్ పోటీ చేశారు. తర్వాత ఆయన మరణించారు. ఇక్కడకూడా అభ్యర్థి కరువే! తిరుపతిలో గత ఎన్నికల్లోనూ.. తర్వాత ఉప పోరులోనూ.. పనబాక లక్ష్మి పోటీ చేశారు. తర్వాత పార్టీకి దూరంగా ఉన్నారు. దీంతో ఇక్కడ ఎవరికి ఇస్తారనేది ప్రశ్న. నరసరావుపేట సాంబశివరావు కు ఇచ్చారు.
మరి వచ్చే ఎన్నికల్లో ఆయనను తప్పించే ప్రయత్నం చేస్తున్నారు. బాపట్లలో మాల్యాద్రి శ్రీరాం కు ఇచ్చారు. ఆయన కూడా ఊసులేకుండా పోయారు. దీంతో ఇక్కడ కూడా కొత్త వారికి తప్పదనే టాక్ వినిపిస్తోంది. మచిలీపట్నంలో కొనకళ్ల నారాయణరావు యాక్టివ్‌గానే ఉన్నా.. ఆయన వద్దంటున్నారు. ఇలా.. ఈ నియోజకవర్గాలపై చంద్రబాబు ఏమీ తేల్చకపోవడం.. అక్కడ నాయకులు లేకపోవడం వంటివి పార్టీకి ఇబ్బందిగా మారిందనే వాదన వినిపిస్తోంది. మరి ఏం చేస్తారో చూడాలి.