దాదాపు ఏపీ ప్రజలు మరిచిపోయిన ప్రత్యేక హోదా విషయంపై కాంగ్రెస్ ఆసక్తిగా స్పందించింది. తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే.. తొలి సంతకం.. ప్రత్యేక హోదా ఫైల్‌పైనే చేస్తామని సంచలన ప్రకటన చేసింది. వాస్తవానికి ఈ ప్రకటన 2019 ఎన్నికలకు ముందుకూడా చేశారు. అయితే.. కేంద్రంలో మళ్లీ మోడీనే అధికారంలోకి వచ్చారు.కానీ, ఇప్పుడు మరోసారి కాంగ్రెస్ ఇదే ప్రకటన చేయడం.. ఆసక్తిగా మారింది.
రాహుల్ గాంధీ ప్రారంభించిన భారత్ జోడో యాత్ర తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పూర్తయిందని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్రమంత్రి జైరాం రమేష్ అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఈనెల 18న ఏపీ కర్నూలు జిల్లా, ఆలూరు ప్రాంతంలో రాహుల్ పాదయాత్ర ఉంటుందని, 4 రోజులు పాటు 85 కి.మీ. సాగుతుందన్నారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే తొలి సంతకం ప్రత్యేక హోదా ఫైల్ పైనే అని స్పష్టం చేశారు.
టిఆర్ఎస్.. బీఆర్ఎస్ కాదని, టిఆర్ఎస్ విఆర్ఎస్ తప్పదని జైరాం రమేష్ జోస్యం చెప్పారు. జోడో యాత్రపై బీజేపీ, మిత్రపక్షాలు విషం చిమ్ముతున్నాయని జైరాం రమేష్ మండిపడ్డారు. తెలుగులో భారత్ జోడో థీమ్ పాట 18న విడుదల చేస్తామన్నారు. ఆర్థిక అసమానత పెరగడం, కుల, మత, బాషా, సామాజిక విభజన, రాజకీయ కేంద్రీకృతం..వీటికి వ్యతిరేకంగా భారత్ జోడో యాత్ర కొనసాగుతుందన్నారు.
బీజేపీ, ఆర్ఎస్ఎస్ భారత్ జోడో యాత్రలో ప్రజల స్పందనను చూసి భయపడుతున్నారన్నారు. కాంగ్రెస్ కు భారత్ జోడో యాత్ర సంజీవిని అని జైరాం రమేష్ వ్యాఖ్యానించారు. అయితే.. ఇదే సమయంలో ఆయన కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికలపై మాత్రం మౌనం వహించారు. ప్రస్తుతం అధ్యక్ష ఎన్నికల అంశం పార్టీలో కీలకంగా మారింది. ఖర్గే వర్సెస్.. థరూర్‌గా మారిన ఈ వివాదంలో ఎవరి వైపు ఎవరు నిలుస్తారనేది కూడా.. ఉత్కంఠగా మారడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates