హైదరాబాద్ సిటీలో రాహుల్ మారథాన్ నడక

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణలో 13 రోజులు ఉండబోతున్నారు. కాంగ్రెస్ పునరుజ్జీవనానికి రాహుల్ 3500 కిలోమీటర్ల భారత్ జోడో యాత్ర ప్రారంభించిన విషయం తెలిసిందే. కన్యాకుమారిలో మొదలైన ఈ పాదయాత్ర కాశ్మీర్లో ముగుస్తుంది. తమిళనాడు, కేరళ, కర్నాటకలో యాత్ర పూర్తిచేసుకుని ఈనెల 24వ తేదీన తెలంగాణాలోకి ఎంటరవుతున్నారు. ఈనెల 24వ తేదీ నుంచి నవంబర్ 5వ తేదీ వరకు రాహుల్ యాత్ర తెలంగాణాలోనే జరగబోతోంది.

వచ్చే నెల 6వ తేదీన మహారాష్ట్రలోకి ఎంటరవుతుంది. అంటే యాత్ర షెడ్యూల్ ప్రకారం మునుగోడు ఉపఎన్నిక జరిగే సమయానికి రాహుల్ తెలంగాణాలోనే ఉంటారు. అయితే ఉప ఎన్నిక ప్రచారానికి మాత్రం దూరంగానే ఉండాలని డిసైడ్ అయ్యారట. కాకపోతే ఉపఎన్నికను దృష్టిలో పెట్టుకుని శంషాబాద్ ప్రత్యేకంగా బహిరంగసభ నిర్వహించాలని పీసీసీ అద్యక్షుడు రేవంత్ రెడ్డి అండ్ కో అనుకుంటున్నది.

పాదయాత్ర రూట్ ను పర్యవేక్షిస్తున్న జై రామ్ రమేష్, దిగ్విజయ్ సింగ్, కొప్పుల రాజు ఇదే విషయమై హైదరాబాద్ కు చేరుకున్నారు. వీళ్ళతో మునుగోడు ఉపఎన్నిక, శంషాబాద్ లో బహిరంగ సభ నిర్వహణ అంశాలను రేవంత్ అండ్ కో చర్చించారు. 13 రోజుల పాదయాత్రలో భాగంగానే హైదరాబాద్ పరిధిలోని ఆరాంఘర్, చార్మినార్, నాంపల్లి, పంజాగుట్ట, కూకట్ పల్లి, మియాపూర్, పటాన్ చెరువు మీద సంగారెడ్డి జిల్లాలోకి ప్రవేశిస్తుంది.

అంతర్గత కుమ్ములాటలతో తీవ్రంగా గొడవలు జరుగుతున్న నేపధ్యంలో రాహుల్ యాత్ర ఏమన్నా కొందరి నేతల్లో అయినా మార్పు తెస్తుందా అనేది అనుమానంగానే ఉంది. రాహుల్ యాత్ర విజయవంతానికి ఇపుడు నేతలంతా ఐకమత్యంగా కష్టపడుతున్నారు. అయితే పాదయాత్ర ముగియగానే నేతల ఆలోచనలు, ఆధిపత్య గొడవలతో మళ్ళీ యధాతథంగా మారిపోతారు. ఇదే పార్టీకి అసలైన సమస్యగా మారిపోయింది. మునుగోడు ఉపఎన్నిక సమయంలో ఇక్కడే ఉండబోతున్న రాహుల్ ఈ విషయంలో అయినా నేతలతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారా అని కొందరు ఎదురుచూస్తున్నారు.